Wednesday, 13 Jan, 5.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
బర్డ్‌ఫ్లూ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు

పీపీఈ కిట్లు వగైరా సిద్ధం చేసుకోండి
10 రాష్ట్రాలకు విస్తరించిన ఏవియన్‌ ఫ్లుయెంజా
మధ్యప్రదేశ్‌లో కడక్‌నాథ్‌ కోళ్లకూ వైరస్‌

దిల్లీ: దేశంలో ఏవియన్‌ ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. నమూనాల పరీక్షలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినన్ని పీపీఈ కిట్లు సిద్ధం చేసుకోవాలని, అవసరమైనచోట్ల పక్షుల సంహారానికి (కల్లింగ్‌) ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం సూచనలు పంపింది. ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంగళవారం పలుచోట్ల పక్షులు మృతిచెందాయి. దేశంలో మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ విస్తరించింది. దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో గత కొన్నిరోజులుగా దాదాపు 300 పక్షులు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్‌లోని ఝున్‌ఝనూ జిల్లా హెచ్‌సీఎల్‌ - ఖేత్రి నగర్‌లో మృతిచెందిన కాకులతో ఏవియన్‌ ఫ్లుయెంజా (హెచ్‌5ఎన్‌8) అదనపు కేసులు బయటపడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లతో పరిస్థితుల సమీక్షకు కేంద్ర బృందాలను ఏర్పాటు చేశారు.
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి నగరంలో మంగళవారం 55 చోట్ల పక్షులు మృతిచెందాయి. బీఎంసీ అధికారులు హెల్ప్‌లైన్‌ నంబరు ఏర్పాటు చేశారు. లాతూర్‌ జిల్లా కేంద్రవాది, సుక్ని గ్రామాల కోళ్ల నుంచి సేకరించిన నమూనాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌ రావడంతో.. ఈ రెండు గ్రామాలకు ఒక కిలోమీటరు పరిధిలో కోళ్లు, పక్షులను సంహరించాలంటూ జిల్లా కలెక్టర్‌ బి.పి.పృథ్వీరాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. లాతూర్‌ మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడిన మూడో జిల్లా. ఈ రెండు గ్రామాల్లో 4 వేలు, పర్భానీ జిల్లాలోని మురుంబా గ్రామంలో 5,500 కోళ్లను అధికారులు పూడ్చిపెట్టారు.
బాందా (యూపీ): కాన్పుర్‌ జూ పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు బయటపడ్డాక ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన హమిర్‌పుర్‌, చిత్రకూట్‌, బాందా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. హమిర్‌పుర్‌ జిల్లా భారువా సుమేర్‌పుర్‌ రైల్వేస్టేషను సమీపంలో కొన్ని కొంగలు, కాకులు మృతిచెందగా.. నమూనాలు పరీక్షలకు పంపారు. చిత్రకూట్‌ జిల్లాలో 200 కోళ్లను పూడ్చిపెట్టారు. బర్డ్‌ఫ్లూ పర్యవేక్షణకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. బాందా జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి గుడ్లు, కోళ్లు రాకుండా సరిహద్దు పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశామని ఏఎస్పీ మహేంద్ర ప్రతాప్‌ చౌహాన్‌ తెలిపారు.
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా కోళ్ల ఫారంలోని కడక్‌నాథ్‌ జాతి కోళ్లకు సైతం బర్డ్‌ఫ్లూ సోకింది. బాగా ఎక్కువ ధరకు విక్రయించే వీటిని వినోద్‌ మేదా అనే యజమాని ఫాం నుంచి 550 కోళ్లు, 2,800 కోడిపిల్లలను అధికారులు స్వాధీనం చేసుకొని గుంతల్లº పూడ్చిపెట్టారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top