Friday, 08 Sep, 4.57 am ఈనాడు

ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్
భావితరాలకు కొత్తగా వికీడాటా


వికీపీడియన్లకు ముగిసిన రెండు రోజుల శిక్షణ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కంప్యూటర్‌, మనిషి చదివేలా వికీపీడియాలో వికీ డాటాను అన్ని భాషల్లో క్రోడీకరించేందుకు కృషి చేస్తున్నట్లు వికీమీడియా ఫౌండేషన్‌ సీనియర్‌ ప్రోగ్రాం అధికారి అసఫ్‌ బార్టోవ్‌ తెలిపారు. దేశంలోని ఏడు నగరాల్లో పర్యటించి స్థానికంగా ఉండే వికీపీడియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా హైదరాబాద్‌లో 15 మంది తెలుగు వికీపీడియన్లతో కార్యగోష్ఠి నిర్వహించారు. ఈ వివరాలను బార్టోవ్‌ గురువారం ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. 'వికీపీడియా సహా అనేక స్వచ్ఛంద, స్వేచ్ఛా విజ్ఞాన ప్రాజెక్టులను కంప్యూటర్లు, మనుషులు చదవగలిగేలా చేయనున్న వికీడాటా ప్రాజెక్టు గురించి వికీపీడియన్లకు శిక్షణ ఇస్తున్నాం. వికీడాటాలో పూర్తి సమాచారాన్ని స్థానిక భాషలో, వీడియోలు, ఛాయాచిత్రాలు, ఆడియోలు ఇలా అన్నింటినీ క్రోడీకరించి అందించనున్నాం. ఇందుకోసం స్థానిక వికీపీడియన్ల సహకారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ వూరి వింతలు, విశేషాలను, గుర్తులను చిన్న ఫొటోగా తీసి commons.wikimedia.org లో పోస్ట్‌ చేయాలి. ప్రస్తుతం 3 కోట్ల 36 వేల అంశాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆయా భాషల్లోకి అనువదించేందుకు కృషి చేస్తున్నాం. వికీపీడియన్ల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది' అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ భాష, కళలు, సంస్కృతి విభాగాధిపతి రహమానుద్దీన్‌ మాట్లాడుతూ ఇప్పటికే తెలుగు సాహిత్యానికి సంబంధించిన పాతపుస్తకాలు తీసుకొని వాటిని అంతర్జాలంలో ఉంచామన్నారు. ప్రస్తుతం 'కోటి మాటల కోట' పేరుతో తెలుగు పదాలను అందరికీ అందుబాటులోకి చేర్చాలనే పని చేస్తున్నామని తెలిపారు. వికీపీడియా 22 భారతీయ భాషల్లో అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడున్న 3 కోట్ల వ్యాసాల్లో ఆంగ్లంలో 57 లక్షల వ్యాసాలు ఉండగా మిగిలిన భాషల్లో ఇతర వ్యాసాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ తెలుగు వికీపీడియా నిర్వాహకులు, డాక్టర్‌ రాజశేఖర్‌, వికీపీడియన్లు భాస్కర్‌నాయుడు, పవన్‌ సంతోష్‌, ప్రణయ్‌రాజ్‌, చిన్మయి తదితరులు పాల్గొన్నారు.
ప్రణయ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని పద్మశాలీ కాలనీకి చెందిన తెలుగు వికీపీడియా రచయిత వంగరి ప్రణయ్‌రాజ్‌ తెలుగు వికీపీడియా రచనలో ప్రపంచ రికార్డు సాధించారు. నాలుగేళ్లుగా తెలుగు వికీపీడీయాలో వ్యాసాలు రాస్తున్న ప్రణయ్‌ 'వికీవత్సరం' అనే శీర్షికతో 365 రోజులు 365 వ్యాసాలు రాసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించారు. 2016 సెప్టెంబర్‌ 8న ప్రారంభించి రోజుకు ఒకటి చొప్పున గురువారానికి 365 వ్యాసాలు రాశారు.గురువారం హైదరాబాద్‌లో జరిగిన వికీపీడియా శిక్షణ శిబిరంలో వికీమీడియా ఫౌండేషన్‌ సీనియర్‌ ప్రోగ్రాం అధికారి అసఫ్‌ బార్టోవ్‌, తెలుగు వికీపీడీయన్లు ప్రణయ్‌రాజ్‌ను అభినందించారు.
Dailyhunt
Top