Tuesday, 11 Aug, 3.56 am ఈనాడు

అమరావతి
భద్రతపై బృంద తనిఖీలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: విజయవాడ పట్టణంలోని హోటల్‌లో ఆదివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాద సంఘటనతో గుంటూరు జిల్లా పాలనాధికారి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విజయవాడ ఘటన నేపథ్యంలో కొవిడ్‌ ఆసుపత్రులతో పాటు, కొవిడ్‌ కేంద్రాలు, గతంలో ప్రతిపాదించిన హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలను కలిపి బృందంగా ఏర్పాటు చేసి.. నివేదికను సమర్పించాలని సూచించారు. కొవిడ్‌ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆసుపత్రులు, పలు హోటళ్లు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.

● అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖల అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశారు. ఆయా తహసీల్దార్ల పరిధిలో ఉన్న కొవిడ్‌ కేంద్రాలు, ఆసుపత్రులను పరిశీలించాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ, విద్యుత్‌ శాఖల అధికారులు ఆయా కేంద్రాలు, ఆసుపత్రులు నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. కొవిడ్‌ కేంద్రానికి గతంలో వచ్చిన ప్రతిపాదనల్లో ఉన్న రెండు హోటళ్లు అనుకూలంగా లేవని గుర్తించారు. గుంటూరులోని అడవితక్కెళ్లపాడులో పేదలకు ఇవ్వడానికి నిర్మించిన గృహాల్లో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు నిరభ్యంతర పత్రాలు లేవని గుర్తించారు. ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలతో పాటు, నగరంలోని ఆసుపత్రుల్లో వసతులు, సదుపాయాలను అధికారులు పరిశీలించారు. మంగళవారం నాటికి నివేదికను పాలనాధికారికి సమర్పించనున్నట్లు బృందాల్లోని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top