Sunday, 15 Sep, 3.30 am ఈనాడు

మెదక్
బీసీలపై ప్రేమ ఉంటే 50 శాతం

రిజర్వేషన్లు ప్రకటించాలి: కత్తి వెంకటస్వామి

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: బీసీలపై ప్రేమ ఉంటే వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని, తెరాస, భాజపా ప్రభుత్వాలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ ఓబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ఓబీసీ విభాగం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల సందర్భంలో బీసీలపై ప్రేమ కురిపించే పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి రిజర్వేషన్లు ప్రకటించాలని కోరారు. ఇప్పటికే అవి నాలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పక 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సీట్లు కేటాయించనుందన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతోందన్నారు.

ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే ప్రజాస్వామ్య పోరాటం చేస్తామని, మరో ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. ప్రజా, బీసీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మతాలు, సామాజికవర్గాలకు అతీతంగా అడుగువేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్ర కీలకమని, అధినేత్రి సోనియాగాంధీతో స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. ఓబీసీ విభాగం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ శ్రీనివాస్‌, నాయకులు దాస అంజయ్య, సతీశ్‌గౌడ్‌, రామచంద్రంగౌడ్‌, శ్రీనివాస్‌, భరత్‌కుమార్‌, రమాదేవి, పద్మ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top