Friday, 08 Jan, 4.51 am ఈనాడు

తమిళనాడు
బుల్లితెర నటి చిత్ర భర్త బెయిలు పిటిషన్‌

పోలీసుల వివరణ కోరిన హైకోర్టు

సైదాపేట, న్యూస్‌టుడే: బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె భర్త హేమంత్‌ రవి బెయిలు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి పోలీసుశాఖ వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. చిత్ర డిసెంబరు 9వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దర్యాప్తు జరిపిన నజరత్‌పేట్టై పోలీసులు.. ఆమె భర్త హేమంత్‌ రవి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు గుర్తించి అరెస్టు చేశారు. డిసెంబరు 14న అరెస్టయిన అతను బెయిలు కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. టీవీ సీరియళ్లలో నటించకూడదని చెప్పినట్లు, నేను అనుమానించడంతోనే ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని పేర్కొన్నారు. 2020 ఆగస్టులో వివాహం జరిగిందని, కుటుంబంతో చిత్ర ప్రేమగా మెలిగిందన్నారు. ఆమె తల్లికి అది నచ్చలేదని ఆరోపించారు. భార్యతో నాకు ఎలాంటి విభేదాలు లేవని, ఎలాంటి నేరానికి పాల్పడలేదని వివరించాడు. బెయిల్‌ మంజూరు చేయాలని హేమంత్‌ రవి కోరాడు.

ఈ కేసు గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ భారతిదాసన్‌ ముందుకు విచారణకు వచ్చింది. ఆర్డీవో విచారణ జరిగినందున, ఈ కేసును కేంద్ర నేర విభాగానికి మార్చినందున సమాధానం ఇచ్చేందుకు రెండువారాల అవకాశం కావాలని పోలీసుశాఖ తరఫున కోర్టుకు విన్నవించారు. బెయిలు నిరాకరించాలని చిత్ర తల్లిదండ్రుల తరఫున తెలిపారు. దీంతో కేంద్ర నేర విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు ఆదేశించిన న్యాయమూర్తి.. కేసుకు సంబంధించిన పత్రాలు దాఖలు చేసి, జనవరి 18వ తేదీ లోగా బదులివ్వాలని పోలీసు శాఖను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top