Monday, 21 Sep, 6.20 am ఈనాడు

కడప
బుస కొడుతున్న కరోనా !

40 వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

450 దిశగా పెరుగుతున్న మృతులు

రోజూ ఆరు వేలకు చేరిన పరీక్షలు

కడప వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ కేసులు బుసకొడుతున్నాయి. ఏప్రిల్‌ 1న ఒకేసారి 15 కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. మే 10వ తేదీ నాటికి ఈ కేసుల సంఖ్య సెంచరీకి చేరింది. ఆగస్టు నెల చివరి నాటికి రోజుకు సగటున 400 కరోనా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు ఆరంభం నుంచి కరోనా కేసుల తీవ్రత పతాక స్థాయికి చేరింది. ఈ నెల ఒకటిన 994 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. 5వ తేదీన ఏకంగా 1,039 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఒకే రోజు వెయ్యి కేసులు నమోదుకావడం జిల్లా అధికార యంత్రాంగాన్ని, నగరవాసులను కలవర పెట్టింది.సెప్టెంబరు 1 నాటికి జిల్లాలో 25,884 కొవిడ్‌ కేసులు ఉండగా 20వ తేదీ నాటికి ఆ కేసుల సంఖ్య 39,716కు చేరింది. అంటే 20 రోజుల్లో 13,832 కేసులు నమోదయ్యాయన్నమాట. సెప్టెంబరు 1 నుంచి 20 వరకు 53 శాతం కేసులు వచ్చాయి. అంటే ఈ నెలలో కరోనా పతాక స్థాయికి చేరిందని చెప్పవచ్ఛు రోజుకు వెయ్యి కేసుల వరకు ఎగబాకిన కరోనా 20వ తేదీ నాటికి 267కు పరిమితం కావడం ఊరటనిచ్చే అంశం.

కొవిడ్‌-19 ఆరంభం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే కరోనా పరీక్షలు, పాజిటివ్‌ కేసుల గుర్తింపు, కరోనా బాధితులకు అందించే చికిత్సా విధానాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం, వైద్యఆరోగ్యశాఖ అవిశ్రాంతంగా చేస్తున్న కృషి కొంత వరకు సత్ఫలితాలను ఇస్తోంది.

కరోనా నిర్ధారణ పరీక్షలు

కొవిడ్‌-19 ఆరంభంలో కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను తిరుపతి స్విమ్స్‌లోని ప్రయోగశాలకు పంపేవారు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వీఆర్‌డీఎల్‌ పద్ధతిలో కరోనా పరీక్షల నిర్ధారణకు ఒక యంత్రాన్ని అమర్చారు. ఇప్పుడు ఆ యంత్రాల సంఖ్య నాలుగుకు చేరింది.

కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగులో ట్రూనాట్‌ యంత్రాల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు.

జిల్లాకు ఆరు సంజీవిని బస్సులను తెప్పించారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో ఒక్కో బస్సును జిల్లాలోని ఇతర ప్రాంతాలకు నాలుగు బస్సులను కేటాయించారు. ● పరీక్ష ఫలితాలు మరింత వేగంగా అందించడానికి ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పుడు సగటున రోజుకు 5 వేల నుంచి 6 వేల మందికి పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో కరోనా పరీక్షలకు 25 కిట్లు అందించారు.

చికిత్సా విధానంలో మార్పులు

తొలి కేసు నమోదైనప్పుడు కరోనా బాధితులకు ఎలాంటి చికిత్స అందించాలి అన్న అంశంపై వైద్యులకు సైతం స్పష్టత లేదు. అయిదున్నర నెలల కాలంలో కరోనా రోగుల చికిత్సా విధానంలో సమూల మార్పులు తెచ్చారు. ఇప్పుడు కరోనా బాధితులకు లో మాలిక్యులార్‌ హెపారిన్‌ను అందిస్తున్నారు. నిమిషానికి 50 లీటర్ల ఆక్సిజన్‌ అందే విధంగా హైఫ్లో నాసల్‌ ఆక్సిజన్‌ను ఇస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రెమిడిసివర్‌, ట్రోసిలోజులాప్‌ వంటి ఖరీదైన ఔషధాలను అందుబాటులో ఉంచారు.

పాజిటివ్‌ కేసుల పెరుగుదల

ఏప్రిల్‌ 1 - సెప్టెంబరు 20 మధ్య జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 నుంచి 39,716కు పెరిగింది. అంటే 40 వేల మార్కును దాదాపు చేరినట్టే. జిల్లా జనాభాలో 1.33 శాతం మంది కరోనా బారిన పడ్డారు.

1% 40 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 414 మంది మృత్యువాత పడ్డారు. అంటే కరోనా బారిన పడ్డవారిలో 1 శాతం మంది మరణించారు.

10 శాతం మందికి పరీక్షలు : ఈ నెల 20వ తేదీ నాటికి జిల్లాలో 3,57,191 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సెప్టెంబరు 18 నాటికి 3.5 లక్షల మార్కును దాటారు. జిల్లా జనాభాలో 10 శాతం మందికి పరీక్షలు చేసినట్టు లెక్క.

కొవిడ్‌ కేంద్రాలివి...

కరోనా బాధితులకు జిల్లా కేంద్రంలోని సర్వజన వైద్యశాల, ఫాతిమా, ప్రొద్దుటూరులోని జిల్లా వైద్యశాల, పులివెందుల్లోని ప్రాంతీయ వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నారు. హజ్‌ భవన్‌, శ్రీనివాస కళాశాల, గ్లోబల్‌ కళాశాల, సీబీఐటీ (ప్రొద్దుటూరు) గిరిజన పాఠశాల రాయచోటి, పులివెందుల్లోని జేఎన్‌టీయూ, అనంతరాజుపేటలోని హార్టికల్చర్‌ భవనాలను కరోనా కేర్‌ సెంటర్లుగా మార్చి బాధితులకు సేవలు అందిస్తున్నారు.

పరీక్షలు పెరగాలి.. మరణాలు తగ్గాలి

భయాన్ని వీడి అనుమానించదగ్గ లక్షణాలు ఉన్న వారు, ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారికి నివాస గృహాల్లోనే ఉండేందుకు అనుమతి ఇస్తున్నారు. కోమ్‌ ఆర్బిడ్‌ లక్షణాలైన మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగం, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ఉన్న వారిని, అధిక వయసు గల వారిని వైద్యశాలలకు తరలించి చికిత్స అందిస్తాం. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడం ద్వారా బాధితులను సకాలంలో గుర్తించి వారికి తగిన చికిత్స అందిస్తూ ప్రాణనష్టాన్ని నివారించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. - డాక్టర్‌ నాగరాజు, నోడల్‌ అధికారి

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top