Thursday, 29 Jul, 6.41 am ఈనాడు

పశ్చిమ గోదావరి
బ్యాంకు సేవలు మీ ముంగిటకే

ఆర్‌బీకేల ఆధ్వర్యంలో కార్యకలాపాలు

బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిజినెస్‌ కరస్పాండెంట్‌

ఆర్‌బీకే పరిధిలోని బ్యాంకునకు సంబంధించిన మేనేజరు, బిజినెస్‌ కరస్పాండెంట్ల చరవాణుల సంఖ్యలను ప్రజలకు తెలిపేలా ప్రదర్శిస్తారు. ప్రజలకు ఏదైనా అదనపు సమాచారం కావాలంటే సంబంధిత బ్యాంకు మేనేజరును ఫోన్‌లో సంప్రదించవచ్ఛు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: బ్యాంకుల సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. మారుమూల గ్రామాల్లో ప్రజలకు సైతం రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా అందించే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

జిల్లాలో 948 ఆర్‌బీకేలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పది, మిగిలినవి గ్రామాల్లో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 835 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు ఉన్నారు. బ్యాంకులు లేని గ్రామాలకు వీరు వెళ్లి ప్రజలకు సేవలు అందించే విధానం ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లోని రచ్చబండ వద్ద లేదా ఏదైనా ఒక ప్రదేశం నుంచి బిజినెస్‌ కరస్పాండెంట్లు బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఇకపై వీరిని ఆర్‌బీకేలో అందుబాటులో ఉంచుతారు. రోజుకు కనీసం రెండు గంటలపాటు వీరు అక్కడ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తారు. ఆ మేరకు సమయాన్ని తెలిపేలా బోర్డు ఏర్పాటు చేస్తారు. బ్యాంకు ఖాతా ప్రారంభం మొదలుకొని.. చెక్‌ బుక్‌ జారీ, డిపాజిట్లు, పేమెంట్లు తదితర కార్యకలాపాలను వీరు నిర్వహిస్తారు. ఒక ఖాతాదారునికి రూ.20 వేల వరకు లావాదేవీలను నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ మొత్తానికి సమీపంలోని బ్యాంకు శాఖకు ఖాతాదారు వెళ్లాల్సి ఉంటుంది. రైతులకు వ్యవసాయ రుణాల మంజూరుకు సంబంధించిన డాక్యుమెంట్లను రూపొందించే బాధ్యతలను సైతం వీరు నిర్వహిస్తారు. రాబోయే రోజుల్లో వీరి సంఖ్యను పెంచనున్నారు. ఒక్కో దానికి ఒక్కొక్కరిని కేటాయిస్తే మరో 113 మంది అవసరం. ప్రస్తుతానికి ఒకట్రెండు ఆర్‌బీకేలకు కలిపి ఒకరిని నియమిస్తారు. ఆ తర్వాత అవసరానికి తగిన విధంగా ఆయా బ్యాంకుల అధికారులు నియామకాలు చేపడతారు. వీరికి కమీషన్‌ ప్రాతిపదికన సొమ్ము చెల్లిస్తారు.

తగ్గనున్న బ్యాంకుల సంఖ్య

జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 33 బ్యాంకులకు సంబంధించిన 638 శాఖలున్నాయి. 948 ఆర్‌బీకేలకు బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమిస్తే ఆయా గ్రామాల్లో ప్రజలకే వీటి ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు శాఖలుంటే ఏదో ఒకదాన్ని మాత్రమే కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రాబోయే రోజుల్లో బ్యాంకు శాఖల సంఖ్య తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రజలకు మరింత చేరువగా..

ఆర్‌బీకేల ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రజలు సైతం సులువుగా సేవలు పొందవచ్ఛు రుణాల మంజూ రు కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఏదైనా సమస్య ఎదురైతే సంబంధిత బ్యాంకు మేనేజరుతో చరవాణిలో మాట్లాడి పరిష్కరించుకునే వీలుంటుంది. వ్యయప్రయాసలు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. - ఎస్‌ఎస్‌ఏ వెంకటేశ్వరరావు, ఎల్‌డీఎం

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top