Friday, 24 Sep, 4.25 am ఈనాడు

కృష్ణ
చిన్న చేపకు పెద్ద కష్టం

పాత పిల్లలు కొనేవారేరీ?
గిట్టుబాటు కాని మీనాల సాగు
కైకలూరు టౌన్, మండవల్లి, న్యూస్‌టుడే


పట్టుబడి చేస్తున్న సాగుదారులు

చేపల రైతుల కష్టాలు గట్టెక్కడం లేదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. మండుటెండల్లో నీరు లేక విలవిల్లాడిపోతున్న చేపపిల్లల్ని కళ్లల్లో పెట్టుకుని పెంచినా ప్రయోజనం చేకూరడం లేదు. చెరువుల్లో విత్తన చేపలకు బేరాలు పూర్తిగా మందగించాయి. ఏటా నీరు లేకపోయినా ఈ సీజన్‌లో మాత్రం వీరికి ఇబ్బందులు ఉండేవి కావు. ఈసారి భారీగా వర్షాలు పడి, డ్యామ్‌లు, ప్రాజెక్టులు, కాలువలు నీటితో కళకళలాడుతున్నా చేపపిల్ల రైతులకు మాత్రం నిరాశనే మిగిల్చింది. రెండేళ్లుగా కరోనాతో చేపల సాగులో నెలకొన్న పరిస్థితులు నేడు పాత పిల్లచేపల రైతులపై ప్రభావం చూపాయి. పచ్చి తవుడు, వేరుసెనగ చెక్క ధరలు ఆకాశాన్ని తాకడంతో చేపల సాగుకు రైతులు ముందుకు రాకపోవడమే వీరికి శాపంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌ ఆక్వారంగానికి ఆయుపు పట్టు తెల్లచేపల (రోహు, కట్ల) రకాలే. కరోనాతో ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ లేకపోవడంతో వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. మరోపక్క నీరు అందుబాటులో ఉన్నా మేతల ధరలు భారీగా పెరిగిపోవడంతో సాగు లాభసాటిగా లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ధరల్లోతెల్ల చేపల సాగు రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితిలేదు. జిల్లాలో అధికార లెక్కల ప్రకారం 1.60 లక్షల ఎకరాల్లోనూ, అనధికారికంగా మరో 20 వేల ఎకరాల్లోనూ ఆక్వాసాగు జరుగుతోంది. ఇందులో 60 వేల వరకు రొయ్యల సాగు, లక్ష ఎకరాల్లో పెద్దచేపలు, 20 వేల ఎకరాల్లో చిన్న పిల్లలను సాగు చేస్తున్నారు.

డిమాండ్‌ తగ్గడానికి కారణాలెన్నో..
ఆకాశాన్ని అంటుతున్న మేతల ధరలు: చేపల మేతలకు వాడే తవుడు, వేరుసెనగ చెక్క ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. తవుడు కేజీ రూ.26, చెక్క రూ.62 వరకు ఉంది. ఈ ధరల్లో సాగు చేయడం కంటే పంట విరామాన్ని ప్రకటించడం మంచిదనే భావనలో రైతులు ఉన్నారు.
చిన్నచెరువుల్లో నిల్వ లేకపోవడం: గతంలో 5 నుంచి 20 ఎకరాల్లోపు చెరువుల్లో పాత చేపపిల్లలను నిల్వ చేసి 250 గ్రాముల బరువు వచ్చిన తర్వాత అమ్మేవారు. ప్రస్తుతం ఈ చెరువుల్లో వనామీ రొయ్యల సాగు వల్ల నిల్వ చేసేవారు లేకపోవడంతో పాతచేప పిల్లలను కొనే నాథులే కరవయ్యారు.
తెల్లచేపల ధరల్లో రాని మార్పు : గడిచిన నాలుగేళ్లుగా తెల్లచేపల సాగు లాభసాటిగా ఉండడం లేదు. కనీసం ఖర్చులు రాని పరిస్థితి నెలకొంది. గత పదేళ్లలో చేపల ధరల్లో పెరుగుదల లేకపోవడం, లీజులు, మేతలు, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో తెల్లచేపల సాగుపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది.

పరిస్థితులు సర్దుకుంటున్నాయి..
కరోనా మిగిల్చిన కష్టాల నుంచి ఆక్వా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వారం రోజులుగా తెల్లచేపల ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరల పెరగడం శుభసూచికంగా కనిపిస్తోంది. మరో నెలలో పరిస్థితి అంతా సర్దుకొనే అవకాశముంది. ధరలు పెరుగుదలతో పట్టుబడులు వేగవంతమై పాతపిల్లకు డిమాండ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. - వర్ధన్, ఇన్‌ఛార్జి ఏడీ, మత్స్యశాఖ, కైకలూరు

దిగజారిన ధరలు
ఎన్నడూ లేని విధంగా చేపల పిల్లల ధరలు దిగజారిపోయాయి. 15 నెలలు పెంచిన తరవాత కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాలోని రైతులు వీటిని పట్టించుకోవడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి రైతులు వస్తున్నా.. తక్కువకు ఇస్తామంటూ ఇక్కడి రైతులు పోటీ పడుతుండటంతో ధరలు ఇంకా దిగజారి పోతున్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top