Thursday, 29 Jul, 5.20 am ఈనాడు

గుంటూరు
డయల్‌ యువర్‌ఎస్పీకి వెల్లువెత్తిన ఫిర్యాదులు

గుంటూరు: గ్రామీణ గుంటూరు జిల్లా ప్రజల కోసం బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎస్పీ తన కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. 25 మంది ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించారు. వాటిపై ఎస్పీ అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత డీఎస్పీ, సీఐలతో మాట్లాడారు. ఫిర్యాదుదారులు ఫోన్‌లో ఉండగానే వారికి వినిపించేలా పోలీసు అధికారులను సదరు కేసు విషయంలో ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మాచర్లకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తమకు మాచవరంలో పొలాన్ని కొంతమంది ఆక్రమించారని, వాటిపై కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆక్రమణదారులు బెదిరిస్తున్నారని, పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది. వృద్ధురాలు తన ఇంటి వద్దనే ఉంటే పోలీసులను అక్కడకు పంపించి ఫిర్యాదు తీసుకొని నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు

'గ్రామీణ గుంటూరు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి రావడానికి ప్రతి సోమవారం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బందిపడటం చూస్తున్నాను. వాటిని తొలగించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని 'డయల్‌ యువర్‌ ఎస్పీ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సోమవారం స్పందనతోపాటు బుధవారం డయల్‌ యువర్‌ ఎస్పీ ఉంటుంది. పోలీసు కార్యాలయంలో ప్రతి రోజు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 'డయల్‌ యువర్‌ ఎస్పీ' నంబరు 8688405050, వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 8866268899కి ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ రికార్డు ద్వారా ఫిర్యాదు చేయొచ్చు' అని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top