Saturday, 25 Sep, 5.45 pm ఈనాడు

తాజా వార్తలు
DC vs RR: అదరగొట్టిన అయ్యర్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ లక్ష్యం 155

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్ డౌన్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్ (43; 32 బంతుల్లో 1×4, 2×6) రాణించగా.. షిమ్రన్‌ హెట్‌మైర్‌ (28; 16 బంతుల్లో 5×4) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఆరంభంలోనే స్వల్ప స్కోరుకే ఓపెనర్లు వెనుదిరిగినప్పటికీ మిడిలార్డర్‌ ఆదుకోవడంతో దిల్లీ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ మొదట నుంచి నెమ్మదిగానే ఆడింది. తొలి మూడు ఓవర్లకు 18/0తో నిలిచింది. కార్తీక్‌ త్యాగి వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో తొలి బంతికి ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (8) క్లీన్‌ బౌల్డయ్యాడు. చేతన్‌ సకారియా వేసిన తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ పృథ్వీ షా(10) లివింగ్‌ స్టన్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 21 పరుగులకే ఆ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రిషభ్ పంత్‌ (24; 32 బంతుల్లో 1×4)తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. రాహుల్ తెవాతియా వేసిన పదో ఓవర్‌లో అయ్యర్ సిక్స్‌ బాదగా.. తర్వాత షంసి వేసిన ఓవర్‌లోనూ బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. అయితే, ముస్తాఫిజుర్‌ వేసిన 12వ ఓవర్‌లో పంత్ ఔటవగా.. ప్రమాదకరంగా మారుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ను రాహుల్ తెవాతియా 14వ ఓవర్‌లో పెలివియన్‌కి పంపించాడు. వీరిద్దరు ఔటైన తర్వాత హెట్‌మైర్‌ కాసేపు మెరుపులు మెరిపించాడు. సకారియా వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. కార్తీక్ త్యాగి వేసిన ఓవర్‌లో మూడు బంతులను బౌండరీకి తరలించాడు. ముస్తాఫిజుర్‌ ఓవర్‌లో హెట్‌మైర్‌ సకారియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్షర్‌ పటేల్ (12; 7 బంతుల్లో 1×6) వేగంగా ఆడబోయి సకారియా బౌలింగ్‌లో మిల్లర్‌కి చిక్కాడు. లలిత్‌ యాదవ్‌ (15), రవిచంద్రన్‌ అశ్విన్‌ (6) నాటౌట్‌గా నిలిచారు. ముస్తాఫిజుర్‌, సకారియా రెండు వికెట్లు, త్యాగి, తెవాతియా తలో వికెట్‌ తీశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top