Thursday, 29 Jul, 5.20 am ఈనాడు

గుంటూరు
దేవినేనిపై రాళ్ల దాడి దుర్మార్గం

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: మైనింగ్‌ అక్రమాలపై ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాళ్ల దాడి దుర్మార్గమని నరసరావుపేట పార్లమెంట్‌ జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీసంపద, ఖనిజాలను వైకాపా నేతలు దోచుకుంటున్నట్లు చెప్పారు. మైలవరం నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్‌ అంశాన్ని పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని, మరో 18 మందిపై వైకాపా వర్గీయులు దాడి చేస్తే నిందితులను వదిలి వీరిపైనే అక్రమ కేసులు బనాయించినట్లు పేర్కొన్నారు. పోలీసులు హత్యాయత్నం, ఎట్రాసిటీ కేసులు పెట్టడంతో ఐపీసీ స్థానంలో జగన్‌ పీనల్‌ కోడ్‌ను అమలు చేస్తున్నట్లుందని విమర్శించారు. వైకాపా దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా తెదేపా పోరాటం చేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో అరాచక పాలన : ప్రత్తిపాటి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మాజీమంత్రి దేవినేని ఉమపై దాడిని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, ఆక్రమణలపై ప్రతిపక్ష పార్టీ నేతలు పోరాటం చేస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వదిలేసి గాయపడిన వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటన్నారు. రాష్ట్రంలో అరాచకపాలనను సమర్థించడం చూస్తుంటే వ్యవస్థల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. న్యాయస్థానాలు పలు సందర్భాల్లో అధికారుల తీరును ప్రశ్నిస్తున్నా మారకపోవడం శోచనీయమన్నారు. తప్పులు చేస్తున్న అధికారులకు రానున్న కాలంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top