Monday, 10 May, 4.25 am ఈనాడు

కృష్ణ
దిగుబడి బాగున్నా...ధరలేక దిగాలు!

నష్టాల్లో వేరుసెనగ రైతులు


గూడూరు మండలం ఆకుమర్రు ప్రాంతంలో వేరుసెనగ రాశులు

వరితో పోల్చుకుంటే వేరుసెనగ పంట లాభదాయకంగా ఉండటంతో వివిధ ప్రాంతాల్లో రైతులు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. ఏటా పంట విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మాత్రం వేరుసెనగ సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. మంచి దిగుబడులు వచ్చినా సరైన ధర లేకపోవడంతో రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. - న్యూస్‌టుడే, గూడూరు

పెరిగిన పెట్టుబడి...

బందరు, గూడూరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో వేరుసెనగ సాగుకు అనువైన భూములు ఉన్నాయి. ప్రధానంగా ఇసుక నేలల్లో ఈ పంట మంచి దిగుబడులు ఇస్తుంది. బందరు మండలంలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో కూడా వేరుసెనగ సాగు అవుతోంది. ప్రస్తుత రబీలో బందరు, పెడన నియోజకవర్గాల్లో దాదాపు 1000 హెక్టార్ల వరకు ఈ పంటను వేశారు. గూడూరు మండలంలోని మల్లవోలు, ముదిరాజుపాలెం, రాయవరం, ఆకుమర్రు, బందరు మండలంలోని కొత్తపూడి, తపశిపూడి, గోకవరం, గోపువానిపాలెం, శిరివెళ్లపాలెం, పెడన, బంటుమిల్లి మండలాల్లో పలు గ్రామాల్లో రైతులు వేరుసెనగ సాగు చేశారు. ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అదే విధంగా పెట్టుబడి కూడా పెరిగింది. విత్తనాల కొనుగోలు నుంచి నూర్పిడి వరకు చూస్తే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్న తరుణంలో ఒకేసారి ధరలు పడిపోవడంతో గిట్టుబాటుకాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు చేసి పెట్టుబడులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో వేరుసెనగ క్వింటాలు రూ.8 వేల వరకు ధర పలికింది. ఆ సమయంలో బందరు మండలంలోని పలు గ్రామాల్లో అక్కడక్కడా కొందరు రైతులు మాత్రమే విక్రయించుకోగలిగారు. మిగిలిన గ్రామాలతోపాటు పెడన, గూడూరు మండలాల్లో ఏప్రిల్‌ నెలాఖరు వరకు పంట నూర్పిడి పనులు సాగుతూనే ఉన్నాయి. తీరా పంట అమ్ముకునే సమయానికి ధర పడిపోవడంతో అన్నదాతలు నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం క్వింటాలు రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు మాత్రమే అడుగుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పెట్టుబడికి అప్పులు చేసిన చాలామంది పంటను నిల్వ ఉంచలేక అయినకాడికే విక్రయిస్తున్నారు. కొందరు మాత్రం ప్రారంభంలో పలికిన ధర వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పండిన పంటకు సరైన ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి...

పంట బాగా పండినా సరైన ధర లేక నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా వేరుసెనగ పంటకు లాభాలు వస్తున్నాయి. దీంతో మా గ్రామంలో చాలామంది రైతులు సాగు చేశారు. ఈసారి కూడా పంట దిగుబడి బాగానే వచ్చింది. ధర కనీసం క్వింటాలుకు రూ.7 వేలు అయినా ఉంటుందేమో అనుకున్నాం. పంట చేతికి వచ్చి అమ్మే సమయానికి ధరలు పడిపోయాయి. చేసేది లేక చాలా మంది రైతులు రూ.5,500, రూ.5,800.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ధరకు విక్రయించారు. గతంతో పోల్చుకుంటే వేరుసెనగ విస్తీర్ణం పెరుగుతున్నందున, సరైన ధరతో కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. - రామయ్య, మల్లవోలు, గూడూరు మండలం

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top