Thursday, 04 Mar, 4.26 am ఈనాడు

మహబూబ్ నగర్
ఎండుతున్నా.. పట్టించుకోరా?

న్యూస్‌టుడే, అలంపూర్‌ పట్టణం

జిల్లాలో హరితహరంలో నాటిన మొక్కలకు సరైన సంరక్షణ లేక సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా గ్రామాల్లో వందలాది మొక్కలు నాటిస్తూ హరిత వనాలుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే వారే లేరు. మొక్కలను కాపాడటంలో గ్రామస్థాయి అధికారులు పూర్తిగా శ్రద్ధ చూపడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన సమయంలో నీటినీ అందించడం లేదు. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో గ్రామాల్లో మొక్కలు కొంత వరకు ఎండిపోతున్నాయి.

సమస్యలిలా.. : జిల్లాలో పలు చోట్ల రహదారుల వెంబడి ఏపుగా పెరగాల్సిన మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నీటి తడులు సరిగా లేక, ట్రీ గార్డులు లేక కనిపిస్తున్నాయి. అయితే చాలా గ్రామాల్లో ట్రీగార్డులు ఏర్పాటు చేయలేదు. మొక్కలకు రక్షణ ఏర్పాట్లు లేక పశువులు, మేకలు, గొర్రెలు మేస్తున్నాయి. గ్రామాల్లో 25 శాతం వరకు మొక్కలకు ట్రీ గార్డులు లేవు.

*● గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లతో నీటిని అందించడం లేదు. గ్రామాల్లోని మొక్కలకు ట్యాంకర్లతో నీటి సదుపాయం కల్పించాల్సి ఉన్నా ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. కనీసం రెండు, మూడు రోజులకోసారి నీటి తడులు అందించక పోవడంతో ఏపుగా పెరగాల్సిన మొక్కలు ఎండిపోతున్నాయి.

* ● గ్రామాల్లో నాటిన మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలను శుభ్రం చేయడం లేదు. దీంతోపాటు ఎండిన మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటి సంరక్షిస్తే మేలని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.

నీరు అందిస్తే మేలు : గ్రామాల్లో నాటిన మొక్కలకు నీటి తడులు అందిస్తే బాగుంటుంది. కానీ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొక్కల సంరక్షణకు కృషి చేయాలి. నాటిన ప్రతి మొక్కను కాపాడటానికి ప్రయత్నించాలి.

- సుశీల, సంతోష్‌నగర్‌, అలంపూర్‌

రక్షణ ఏర్పాట్లు తప్పనిసరి : మొక్కలకు ఎక్కడా రక్షణ ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో పశువులు, మేకలు వీటిని తింటున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకుని ట్రీగార్డులు ఏర్పాటు చేయాలి. లేకుంటే వేసవిలో మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

- మౌనమ్మ, ఊట్కూరు

అశ్రద్ధ చేస్తే చర్యలు : మొక్కల సంరక్షణ పట్ల అశ్రద్ధ చేస్తే చర్యలు తప్పవు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటించాం. వాటిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. ప్రతి మొక్కకు తప్పక నీరు పెట్టాలి.

- సుగుణకుమార్‌, ఎంపీడీవో, అలంపూర్‌

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top