Friday, 24 Sep, 4.55 am ఈనాడు

అమరావతి
ఎత్తులు... పైఎత్తులు

ఈనాడు-అమరావతి

జిల్లాలో తెదేపా అత్యధిక ఎంపీటీసీ స్థానాలు సాధించిన దుగ్గిరాల మండలంలో ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తెదేపాకు 9, జనసేన 1, వైకాపాకు 8 స్థానాలు వచ్చాయి. సాంకేతికంగా తెదేపాకు మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థులకే ఎంపీపీ, ఇతర పదవులు దక్కాలి. అయితే జనసేన మద్దతు కీలకం కావడం, వారు ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది. తెదేపా తరఫున ఎంపీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన మహిళకు బీసీ కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేస్తే తిరస్కరించడంతో రాజకీయం రసకందాయంగా మారింది. తెదేపా తరఫున గెలిచిన అభ్యర్థుల్లో బీసీ మహిళ ఒక్కరే ఉండడంతో ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. తెదేపా నేతలు కులధ్రువీకరణ పత్రం మంజూరు విషయమై న్యాయస్థానానికి వెళ్లడంతో న్యాయస్థానం కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం ఎన్నిక జరుగుతున్నందున ఆ సమయానికి తెదేపా అభ్యర్థికి కులధ్రువీకరణ పత్రం వచ్చే అవకాశం లేదు. దీంతో వారు ఎన్నికకు దూరంగా ఉంటారా? హాజరవుతారా? అన్న విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. తెదేపా తరఫున ఎంపీపీ అభ్యర్థి జబీన్‌ కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ముల పిల్లలకు ఇప్పటికే బీసీ కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని, ప్రస్తుతం ఉన్న తహసీల్దారు కూడా ఒక ధ్రువపత్రం ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అభ్యర్థి బాబాయి జలాలుద్దీన్‌ వాపోయారు. కుటుంబ సభ్యులకు జారీ చేసిన బీసీ ధ్రువీకరణ పత్రం జత చేసినా మంజూరు చేయలేదన్నారు. ఎంపీపీ ఎన్నిక సక్రమంగా నిర్వహించకూడదనే ఉద్దేశంలో భాగంగానే ఎన్నికల అధికారిని కూడా మార్చారని తెదేపా నేతలు ఆరోపించారు. మరోవైపు వైకాపా వారు ఎంపీపీ పదవి తమకే దక్కుతుందని ఇప్పటికే ప్రకటించడంతో పాటు ప్రమాణ స్వీకారానికి బంధువులు, స్నేహితులను కూడా ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశమైంది. తాము పదవి దక్కించుకుంటామన్న ధీమాతోనే ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న చర్చతోనే ఎన్నిక సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. తెదేపాకు చెందిన 9మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకుండా జనసేన అభ్యర్థి కూడా గైర్హాజరైతే కోరం లేక ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. వైకాపా సభ్యులు 8 మందితో పాటు జనసేన ఎంపీటీసీ సభ్యుడు హాజరైతే కోరం ఉంటుంది కనుక ఎన్నిక జరుగుతుంది. దీంతో జనసేన ఎంపీటీసీ సభ్యుడు హాజరు అత్యంత కీలకంగా మారింది. ఇరుపార్టీల ఆధిక్యం జనసేన సభ్యుడిపై ఆధారపడి ఉంది.

పదవుల పంపకంపై తకరారు

జిల్లాలో ఒక్క దుగ్గిరాల మినహా అన్ని మండలాల్లో వైకాపా మెజారిటీ ఎంపీటీసీ సభ్యుల స్థానాలు గెలుచుకోవడంతో ఆపార్టీ అభ్యర్థులకే అన్ని పదవులు దక్కనున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీలో కొన్ని మండలాల్లో పదవుల పంపకంపై తకరారు ఏర్పడింది. ఆయా పదవులకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరక నియోజకవర్గ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. సింహభాగం మండలాల్లో పదవుల పంపకంపై స్పష్టత వచ్చినా కొన్నిచోట్ల చర్చలు కొలిక్కి రాలేదు. పెదకూరపాడు మండలం ఎంపీపీ పదవి తొలుత బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇస్తున్నారన్న సమాచారంతో మరొకరు తెరపైకి వచ్చారు. దీంతో పార్టీలో మండల స్థాయి నేత ఒకరు, జిల్లా స్థాయి నేత ఒకరు ఎంపీపీ పదవికి పోటీ పడడంతో రాజకీయం మొదలైంది. ఇద్దరు నేతలను గుంటూరుకు పిలిపించి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చర్చించారు. రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నిక వాయిదాపడే అవకాశం ఉంది. పెదనందిపాడు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా భార్యాభర్తలు ఎంపికయ్యారు. వీరితోపాటు మరో ఎంపీటీసీ సభ్యురాలు కూడా జతకలిశారు. తాము సూచించిన వ్యక్తికి పదవి ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తామని నిరసన తెలిపారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top