Friday, 02 Mar, 9.10 am ఈనాడు

తాజా వార్తలు
గుంటూరు కుర్రోడు.. ఐరాసలో మెరిశాడు

యూత్‌ అసెంబ్లీకి హాజరు రైతు సమస్యలు ప్రస్తావించి ఆకట్టుకున్న అఖిల్‌ ఈనాడు-అమరావతి ఐక్యరాజ్యసమితి నిర్వహించిన యూత్‌ అసెంబ్లీలో పాల్గొని అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన నిమ్మగడ్డ అఖిల్‌. అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన యువ సమ్మేళనం వేదికగా తన ఆలోచనలను పంచుకున్నారు. మన దేశంలో సమస్యలు వివరించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు న్యూయార్క్‌ వేదికగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన మూడురోజుల యూత్‌ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో భాగస్వాములయ్యారు. 140 దేశాల నుంచి వచ్చిన యువ ప్రతినిధులతో మమేకం కావడంతో తన ఆలోచనా దృక్పథం మారిందని అఖిల్‌ పేర్కొన్నారు. మూడురోజుల సదస్సులో చర్చించిన అంశాలు, ప్రపంచం ముందున్న సవాళ్లు, యువత భాగస్వామ్యం, రైతుల సమస్యలపై ప్రజంటేషన్‌ తదితర అంశాలపై 'ఈనాడు'తో మాట్లాడారు. క్యరాజ్యసమితి నిర్వహించిన యూత్‌అసెంబ్లీకి వివిధ దేశాల నుంచి వచ్చిన యువప్రతినిధులు వారి దేశాల్లో సమస్యలు, వాటికి పరిష్కారమార్గాలను అందరితో పంచుకున్నారు. అక్కడి సమస్యలపై వారు పోరాడుతున్న తీరు, ఎదురవుతున్న అడ్డంకులు వివరించారు. అందరిలో ఉన్న ఆలోచన, భావన ఒక్కటే.. ఈ ప్రపంచాన్ని మెరుగుపర్చి ఉన్నతస్థితికి తీసుకెళ్లాలనేది. సదస్సులో ఎన్నో వేల చేతులు కలిశాయి... వందల గొంతులు గళం విప్పాయి. మనదేశంలో పోలియోను నిర్మూలించడంలో మనకృషిని కొనియాడిన ఐరాస ప్రతినిధులు మలేరియా, ఎయిడ్స్‌ వ్యాధిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎయిడ్స్‌ వ్యాధి వైరస్‌ని ఏఆర్‌టీ ద్వారా అదుపుచేసి కొన్ని లక్షలమంది జీవితాలను కాపాడుతున్న వైనాన్ని వివరించారు. గ్లోబల్‌ వార్మింగ్‌పై జరిగిన సదస్సులో వాతావరణ సమతుల్యత సాధించకపోతే సముద్రమట్టం పెరిగి ముంబయి, లండన్‌, న్యూయార్క్‌ వంటి మహానగరాలు భవిష్యత్తులో కనమరుగయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఆహారభద్రత అంశంపై యువ ప్రతినిధులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 1.3 బిలియన్‌ టన్నుల ఆహారం ప్రతి సంవత్సరం వృథా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని, ఏడాదికి 30 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారని గుర్తు చేశారు. ఆహారం వృథాను అరికట్టి ఆకలితో ఉన్న ప్రజలకు చేర్చడానికి గల మార్గాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా విద్యుత్తు సౌకర్యం అందుబాటులో లేదు. ఇప్పటికే విద్యుత్తు ఉత్పత్తి విస్తరణ సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ తరుణంలో వాతావరణ మార్పులు పెనుసవాల్‌గా మారాయని సదస్సు చర్చించింది. ప్రస్తుతం శిలాజ ఇంధనాలు 70శాతం విద్యుచ్ఛక్తిని ప్రపంచానికి అందిస్తున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి బయటపడాలంటే దీనిని 7శాతానికి తగ్గించక తప్పదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ నివేదికపై విస్తృతంగా చర్చించి పరిష్కారమార్గాలను అన్వేషించాలని యువతకు పిలుపునిచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి పెంచి ఖర్చును తగ్గించే క్రమంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ఆహ్వానించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యువత స్పందించాల్సిన తీరు, ఆలోచనలను ప్రారంభసంస్థగా మార్చడానికి తీసుకోవాల్సిన వివిధ దశలపై యువత పలు ప్రజంటేషన్లు ఇచ్చారు. రైతుసమస్యలపై ప్రదర్శన నిమ్మగడ్డ అఖిల్‌ వ్యవసాయకుటుంబానికి చెందినవారు. ఉన్నతవిద్యను అభ్యసించి అమెరికాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నా చిన్నప్పుడు పొలాల్లో తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ వాటికి పరిష్కారమార్గాలను అన్వేషిస్తున్నారు. ఈక్రమంలో ఐక్యరాజ్యసమితి నుంచి యూత్‌అసెంబ్లీలో పాల్గొనే అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతులు విచ్చలవిడిగా పురుగుమందుల వినియోగం, ఆహారపదార్థాల విషతుల్యం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలపై సదస్సులో ప్రదర్శన ఇవ్వడం ద్వారా అకట్టుకున్నారు. రైతులు రక్షణ కవచాలు లేకుండా పురుగుమందులు చల్లడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉదాహరణలతో వివరించారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో పురుగుమందులు చల్లే క్రమంలో మృతిచెందిన రైతుల వివరాలు సదస్సుకు వివరించి ప్రమాదతీవ్రతను గుర్తుచేశారు. పురుగుమందుల అవశేషాలు ఆహారపదార్థాల్లో ఉండటం వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరించి పరిష్కారమార్గాలను చూపారు. అవగాహనతోనే సమస్యలకు పరిష్కారం - నిమ్మగడ్డ అఖిల్‌, ఐటీ ఉద్యోగి ఐక్యరాజ్యసమితి సమున్నతమైన 17లక్ష్యాలను 2030లోగా సాధించాలని యువతకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లి వాతావరణ కాలుష్యం, పరిసరాల శుభ్రత, సమాజసేవలో విద్యార్థుల పాత్రపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. యువసమ్మేళనంలో 22ఏళ్లకే వారు ప్రదర్శించిన చొరవ నాలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. పాఠశాల దశ నుంచి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయనేది నానమ్మకం. మరో ఇద్దరు స్నేహితులతో కలసి బృందంగా ఏర్పడి రైతులు పురుగుమందులు చల్లే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం. ఇందుకు ఒక సంస్థ స్థాపించి రైతులకు రక్షణ కవచాలు అందిస్తాం. ఎంత సంపాదించినా మనచుట్టూ ఉన్న పరిసరాలు బాగున్నప్పుడే మనం బాగుంటాం అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top