Friday, 26 Feb, 3.45 pm ఈనాడు

తాజా వార్తలు
గుంటూరు మేయర్‌ పీఠం మాదే: కన్నా

గుంటూరు: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధి భాజపా-జనసేన గెలుపుతోనే సాధ్యమని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని ఆయన నివాసంలో భాజపా-జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. భాజపా-జనసేన అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీల్లో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు.

''ఇంటి నిర్మాణం, భూమార్పిడి, నల్లా కనెక్షన్‌కు ఎమ్మెల్యేలు వసూలు చేసే ట్యాక్స్‌ లేకుండా చేస్తాం. అధికార పార్టీ నేతలు ఇచ్చే తాయిలాలకు ఆశ పడకుండా ప్రజలు ఓట్లు వేయాలి. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో తెదేపా.. ఇప్పుడు వాలంటీర్ల పేరిట వైకాపా తమ కార్యకర్తలకు దోచి పెడుతోంది. పల్నాడు ప్రాంతంలో మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు అరాచకం సృష్టిస్తున్నారు. అక్కడ మరోసారి నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ప్రజలు కట్టిన పన్నులు పైసా కూడా వృథా కాకుండా వారి కోసమే ఖర్చు చేస్తాం'' అని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని కన్నా ఆరోపించారు. ప్రభుత్వం నిజంగా ప్రజల కోసమే పనిచేస్తే ఇతర పార్టీల నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో అధికార పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన-బాజపా కూటమి విజయం సాధిస్తుందని.. గుంటూరు మేయర్‌ పీఠం తమ కూటమిదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top