Saturday, 12 Oct, 5.30 am ఈనాడు

మెదక్
గుట్టు విప్పేందుకు తవ్వి తీశారు..

మృతదేహం వెలికితీసి పరీక్ష
హత్యాకాండలో ముగ్గురి కంటే ఎక్కువ మంది..!

చేగుంట, న్యూస్‌టుడే: మానవత్వం మరిచి కన్నకొడుకును చంపి పాతిపెట్టిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య చేసి భూమిలో పాతిపెట్టిన మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు బయటకు తీశారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ కోమండ్ల నారాయణరెడ్డి తన కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డిని సోమవారం రాత్రి హత్య చేసి వ్యవసాయ భూమిలో పాతిపెట్టి మూడు రోజులకు పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. తూప్రాన్‌ డీఎస్‌పీ కిరణ్‌కుమార్‌ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. తర్వాత చేగుంట తహసీల్దారు గోవర్ధన్‌ పంచనామా నిర్వహించారు. అనంతరం పోలీసులు గోతిని తవ్వించి బయటకు తీయించారు. మృతదేహం తలపై బలమైన గాయాన్ని గుర్తించారు. అనంతరం శవపరీక్ష చేసి అక్కడే పూడ్చేశారు.

భారీ బందోబస్తు
మృతదేహాన్ని బయటకు తీస్తున్నారని తెలియడంతో చేగుంట, రామాయంపేట, దౌల్తాబాద్‌ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్రహీంపూర్‌కు వచ్చారు. చంపడానికి చేతులెలా వచ్చాయని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకున్నారు. తూప్రాన్‌ సీఐ స్వామిగౌడ్‌తో పాటు చేగుంట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట ఎస్‌ఐలు సత్యనారాయణ, మహేందర్‌, ఆంజనేయులు, ప్రకాష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తరలివచ్చిన బంధువులు
సొంత తమ్ముడు తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడని తెలిసి మేడ్చల్‌లో ఉండే అక్కతో పాటు హైదరాబాద్‌లో ఉండే అన్న కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. పలువురు బంధువులు సైతం పెద్ద ఎత్తున వచ్చారు. నిందితుడు నారాయణరెడ్డి భార్య మంజుల రాలేదు. ఆమె ఇబ్రహీంపూర్‌ నుంచి గురువారం మద్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. శ్రవణ్‌కు ఆమె సవతి తల్లి. హత్య జరిగిన విషయం ఆమెకు ముందే తెలిసి ఉంటుందని అనుమానం
వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్నాం: కిరణ్‌కుమార్‌, డీఎస్పీ, తూప్రాన్‌
ఈ హత్యాకాండపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన సంఘటన స్థలంలో విలేకరులతో మాట్లాడుతూ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఇందులో భాగస్థులెవరెవరో పరిశీలిస్తున్నామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రెండు రోజుల్లో అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి: రఘునందన్‌రావు
ఈ హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు కోరారు. శుక్రవారం ఆయన చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామంలో శ్రవణ్‌కుమార్‌రెడ్డి సోదరుడిని పరామర్శించారు. నిందితుడు తెరాసకు చెందిన నాయకుడు కావటం వల్ల కేసు నీరుగారే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని కోరారు.

తమ్ముళ్లతో కలిసి..
ఈ హత్యాకాండలో నారాయణరెడ్డి, ఆయన సోదరులు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శ్రవణ్‌కుమార్‌రెడ్డిని నారాయణరెడ్డి, హనుమంతరెడ్డి కలిసి చంపగా.. బోరు పక్కన గొయ్యి తీస్తుండగా రాంరెడ్డి సహాయం చేసినట్లు భావిస్తున్నారు. ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. వీరికి గ్రామంలో మరో ఇద్దరు సహకరించారనుకుంటున్నారు. ప్రధాన నిందితుడు నారాయణరెడ్డితో పాటు అతని తమ్ముళ్లు రాంరెడ్డి, హనుమంతరెడ్డి పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే లొంగిపోయారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top