అమరావతి
హరితవాడగా మారుద్దాం

ఈనాడు, అమరావతి
బెజవాడ నగరానికి 'బ్లేజ్‌వాడ' అనేది పర్యాయ పదంగా మారింది. దీనికి ప్రధాన కారణం వేసవిలో విజయవాడలో కనిపించే విపరీతమైన ఎండలే. బయటకు రావాలంటే హడలిపోయేంతగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సహజ వనరులు ధ్వంసం అయ్యేంతగా పరిమితికి మించి పట్టణీకరణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత నగరం పరిపాలన కేంద్రంగా మారడంతో నగరం బాగా విస్తరించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత 20 ఏళ్లలోనే నగరం అనేక రెట్లు పెరిగింది. నీటి వనరులు, పచ్చదనం ధ్వంసం కావడంతో వేడిగాల్పుల ప్రభావం పెరుగుతోంది. చలికాలంలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వాతావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
పాలకులు ఈ అంశంపై దృష్టి సారించాలి. అప్పుడే బ్లేజ్‌వాడ.. హరితవాడగా మారుతుంది.
విజయవాడకు ఎంతో ప్రాధాన్యం.. కృష్ణా నది ఒడ్డున విస్తరించిన నగర సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది. బ్యారేజీ నుంచి మొదలయ్యే ఏలూరు, బందరు, రైవస్ కాలువలు నగరం గుండా ప్రవహిస్తున్నాయి. బెజవాడ పలు జిల్లాలకు కూడలిగా అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన అనంతరం పాలన ఇక్కడే కేంద్రీకృతం కావడంతో వాణిజ్య, పాలన రాజధానిగా ఎదిగింది. నిర్మాణ, విద్య, ఆహార శుద్ధి, తదితర రంగాలలోనూ వృద్ధి సాధిస్తోంది. దీంతో ఉపాధి నిమిత్తం వచ్చే వారి సంఖ్య పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. ఫలితంగా జనావాసాలు కూడా అదే రీతిలో విస్తరించాయి.
భవిష్యత్తులో ముప్పు తప్పదు.. 2011 లెక్కల ప్రకారం నగర జనాభా 10.50 లక్షలు. ప్రస్తుతం ఇది 15 లక్షలకు చేరింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా పంట పొలాలు, నీటి వనరులను కూడా జనావాసాలుగా మార్చారు. ఇలా అసాధారణంగా విస్తరించడంతో పచ్చదనం ధ్వంసమైంది. అక్కడక్కడా ఉన్న నీటి జాడలు కూడా కనుమరుగయ్యాయి. నగరంలో జనసాంద్రత బాగా పెరిగింది. పచ్చదనం తగ్గడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైంది. వేసవి, చలి, వర్షాకాలమైనా వేడి వాతావరణం ఉంటోంది. ఇక వేసవి అయితే వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటోంది. నగరంలో వచ్చే పదేళ్లలో జనాభా బాగా పెరిగే అవకాశం ఉంది. పచ్చదనాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు చాలా నష్టపోతాయి.
అందరిదీ బాధ్యత..
విజయవాడను హరితమయం చేసే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు. నగరపాలక సంస్థతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. కాలనీల్లోని అన్ని సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రియాశీలకం కావాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల్లో విధిగా మొక్కలు పెంచాలి. నగరంలో కొండలు ఎక్కువ. వీటిపై పచ్చదనం పెరిగితే ప్రయోజనం ఉంటుంది. కొండలపై పచ్చదనం పెంచడానికి హెలికాప్టర్ ద్వారా సీడ్‌బాల్స్‌ను చల్లాలి. ఇది వర్షాకాలం ముందు చేస్తే.. చల్లినందువల్ల ఉపయోగం ఉంటుంది. వర్షాలకు మొక్కలు విస్తారంగా పెరుగుతాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కాంక్రీట్ జంగిల్‌గా మారకుండా మనం కాపాడుకున్నట్లు అవుతుంది.
కొత్త పాలకవర్గం దృష్టి పెట్టాలి.. ఇదే ధోరణి ఇకపై కూడా కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను మార్చేందుకు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఇది గొడ్డలిపెట్టుగా మారనుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలి. పచ్చదనాన్ని బాగా పెంపొందించాలి. తక్కువ వేడిని విడుదల చేసే నిర్మాణ సామగ్రిని వినియోగించాలి. విజయవాడ నగరంలో జనావాసాల విస్తీర్ణం బాగా పెరిగింది. జన సాంద్రత, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు పెరగడంతో నగరôలో హరిత ఛట్రం తగ్గుతోంది. దీని వల్ల వేసవి, శీతా కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బెజవాడను నివాసయోగ్య నగరంగా మార్చడానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజలు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. పచ్చదనం, నీటి వనరులను పరిరక్షించాల్సి ఉంది.
-కొడాలి సుభాష్‌చంద్రబోస్, క్లీన్ అండ్ గ్రీన్
ఎన్విరాన్మెంట్ సొసైటీ, విజయవాడ