Friday, 24 Sep, 5.15 am ఈనాడు

మార్కెట్‌
ఇ-కామర్స్‌ విక్రయాలు 23% పెరగొచ్చు: రెడ్‌సీర్‌

దిల్లీ: ఈ పండుగల సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థల విక్రయాలు 23 శాతం మేర పెరిగి 900 కోట్ల డాలర్లకు (సుమారు రూ.67,000 కోట్లు) చేరొచ్చని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంస్థల స్థూల విక్రయాల విలువ (జీఎంవీ) 740 కోట్ల డాలర్లుగా నమోదైందని పేర్కొంది. పూర్తి ఏడాదికి ఆన్‌లైన్‌ స్థూల జీఎంవీ 4,900-5,200 కోట్ల డాలర్లుగా నమోదు కావొచ్చని, గత ఏడాది విక్రయాలు 3,820 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 37 శాతం అధికమని 'ఇ కామర్స్‌ ఫెస్టివ్‌ సీజన్‌' నివేదికలో రెడ్‌సీర్‌ వివరించింది. కొవిడ్‌-19 తర్వాత వినియోగదార్లు అన్ని విభాగాల్లోనూ ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు దిగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. పండుగల సీజన్‌ తొలి వారంలోనే 30 శాతం వార్షిక వృద్ధితో స్థూల విక్రయాల విలువ 480 కోట్ల డాలర్లుగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. స్థూల జీఎంవీ అంటే ఇకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై విక్రయించే మొత్తం వస్తువుల విలువ. ఆర్డర్ల రద్దు/రిటర్నులను తీసివేయడానికి ముందు లెక్కించే విలువ ఇది.

గప్‌షుప్‌ చేతికి అమెరికా కంపెనీ

దిల్లీ: మెసెజింగ్‌ ప్లాట్‌ఫాం అయిన గప్‌షుప్‌ తాజాగా న్యూజెర్సీకి చెందిన డాట్‌గోను కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికన్న విషయం బయటకు వెల్లడించలేదు. ఈ ఏడాది మొదట్లో టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి దాదాపు 746.6 కోట్ల(100 మి. డాలర్లు)ను గప్‌షుప్‌ సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ సమీకరణ నిమిత్తం కంపెనీ విలువను 1.4 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. కాగా, డాట్‌గో కొనుగోలుతో మరింత బలోపేతం అవుతామని.. డాట్‌గోకు ఆఫ్రికాలో ఉన్న బలమైన నెట్‌వర్క్‌తో మరింత విస్తరించగలమని గప్‌షుప్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉద్యోగాల రికవరీ నెమ్మదించింది: సీఎంఐఈ

ముంబయి: కొవిడ్‌ మహమ్మారి సృష్టించిన అంతరాయాలతో ఉద్యోగాల రికవరీ నెమ్మదించడమే కాకుండా అసమానంగా ఉందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) వెల్లడించింది. 2019-20 నాటి ఉద్యోగాలతో పోలిస్తే 2021 ఆగస్టులో 57 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. వేతన ఉద్యోగులు, వ్యాపారవేత్తల ఉపాధి అవకాశాలపై అధిక ప్రభావం పడిందని, ఇదే సమయంలో వ్యవసాయ, రోజువారీ వేతన కార్మికులు, చిన్న ట్రేడర్లకు ఉపాధి పెరిగిందని పేర్కొన్నారు. కాగా కోల్పోయిన 57 లక్షల ఉద్యోగాల్లో 37 లక్షలు పట్టణ ప్రాంతాల్లో, 19 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కోల్పోయారని వెల్లడించారు. వ్యవసాయ రంగం ఆదుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిపై ప్రభావం తక్కువగా పడిందని పేర్కొన్నారు.

వాహన రంగానికి రూ.25,938 కోట్ల
పీఎల్‌ఐ పథకం నోటిఫై

దిల్లీ: వాహన రంగం కోసం ప్రకటించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. అధునాతన ఆటోమోటివ్‌ సాంకేతిక ఉత్పత్తుల దేశీయ తయారీ, పెట్టుబడుల ఆకర్షణ నిమిత్తం ఇది వరకే ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అధునాతన ఆటోమోటివ్‌ సాంకేతికతకు సంబంధించి వాహన, వాహన విడిభాగాల విక్రయాలకు ప్రోత్సాహకాలను ఇవ్వడం దీని ఉద్దేశం. అనుమతి పొందిన దరఖాస్తుదారుకు అయిదేళ్ల పాటు ప్రయోజనాలు అందుతాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top