Monday, 04 Nov, 3.40 pm ఈనాడు

తాజా వార్తలు
ఇద్దరు హీరోలున్నా 'ఆర్‌ఆర్‌ఆర్‌' కథలో ఉన్నది అదే!

చిరంజీవి ఫోన్‌ చేయగానే నా చేయి వణికి పోయింది

ఆయన సంభాషణల్లో పదును ఉంటుంది. ఆ మాటల్లో భావోద్వేగం ఉంటుంది. వినడానికి చిన్న మాటలైనా వాటి వెనుక ఆకాశమంత అర్థం ఉంటుంది. 'సమయం లేదు మిత్రమా' అంటూ ఆయన వదిలిన సంభాషణల బాణం తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. నాటక రంగంతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 'కృష్ణం వందే జగద్గురుమ్', 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'మహానటి', 'సైరా' వంటి ఎన్నో అద్భుత చిత్రాలకు సంభాషణలు రాసిన రచయిత బుర్రా సాయిమాధవ్‌. ఈటీవీలో ప్రసారమయ్యే 'చెప్పాలని ఉంది' కార్యక్రమానికి విచ్చేసి తన చిన్న నాటి సంగతులు, సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటనలు, రాజమౌళి-ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారిలా..!

బుర్రా సాయిమాధవ్‌తో మాటలు రాయించుకుంటే అది రెండు, మూడొందల కోట్ల సినిమా అవుతుందని అంటున్నారు నిజమేనా?
సాయిమాధవ్‌: (నవ్వులు) అలా ఏమీ లేదండీ. నేను రాసిన చిత్రాల్లో దెబ్బతిన్నవి కూడా ఉన్నాయి. అన్నీ సూపర్‌హిట్లు అవ్వవు కదా!

నాటకరంగం నుంచి సినిమా రంగం వరకూ మీ ప్రస్థానం ఎలా సాగింది?
సాయిమాధవ్‌: నా తల్లిదండ్రులు ఇద్దరూ స్టేజ్‌ ఆర్టిస్ట్‌లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో హార్మోనియం సౌండ్‌ వినిపిస్తూనే ఉండేది. అలా చిన్నప్పటి నుంచి నాటక రంగంపై ఆసక్తి ఏర్పడింది. అయితే, అమ్మానాన్నలు పౌరాణిక నాటకాలు వేసేవారు. నాకు మాత్రం సోషల్‌ డ్రామాలపై ఆసక్తి ఏర్పడింది. నా ఆరేళ్ల వయసులో 'సత్యహరిశ్చంద్ర' నాటకంలో లోహితాసుడి పాత్ర పోషించా. పెద్ద పెద్ద నటులు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఒక నాటకం వేస్తూనే మధ్యలో వేరే నాటకానికి సంబంధించిన కొన్ని సీన్లు పెట్టేవారు. అందులో బాలనాగమ్మ సన్నివేశంలో మా అమ్మ సంగు పాత్రను పోషించారు. అప్పుడు ఆమె వెంటే నేనూ నాటకానికి వెళ్లా. అయితే, హరిశ్చంద్రలో లోహితాసుడి పాత్ర చేసే కుర్రవాడు రాకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఆ పాత్ర లేకుండానే నాటకం వేయమని కాంట్రాక్టర్‌ చెప్పారు. అయితే, ధూళిపాళ్లగారు ఒప్పుకోలేదు. తాను స్టేజ్‌ కూడా ఎక్కనని కచ్చితంగా చెప్పేశారు. ఆ సమయంలో రామనాథనాయుడుగారు వీరబాహుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన మా కుటుంబానికి స్నేహితుడు. నన్ను చూపిస్తూ.. 'వీడితో ఆ పాత్ర వేయించండి. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లా డైలాగ్‌లు చెబుతాడు' అన్నారు. నన్ను అడిగితే నేను 'సరే' అన్నా. మా అమ్మ స్టేజ్‌పై నుంచి వచ్చేసరికి నాకు మేకప్‌ వేసి కూర్చోబెట్టారు. ఆమె ఆశ్చర్యపోయారు. నాటకం మధ్యలో ప్రాముఖ్యం ఉన్న డైలాగ్‌లు నా చెవిలో చెబుతూ ఎలా చెప్పాలో వివరించేవారు. నేను కూడా వెంటనే అందుకుని ఆ డైలాగ్‌లు చెప్పేసేవాడిని. అలా ఆ నాటకానికి మంచి పేరొచ్చింది. దాంతో నేను ఆరోతరగతి చదివే నాటి నుంచి వరుసగా నాటకాలు ఆడటం మొదలు పెట్టా. మా గురువు శివరామకృష్ణగారు, వాళ్లబ్బాయి కృష్ణగారు నాలో నటుడిని గుర్తించి నాటకంలో అవకాశాలు ఇచ్చేవారు. కర్పూరపు ఆంజనేయులుగారు రాసిన 'గడియారం' అనే నాటికలో కుక్షేశ్వరరావు అనే పాత్ర పోషించా. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు, నాటకాలు తప్ప వేరే వ్యాపకం ఉండేది కాదు.

మరి నాటకాలు వేస్తూ, మీరెలా చదువుకున్నారు?
సాయిమాధవ్‌: పదో తరగతి వరకూ బాగానే చదువుకున్నా. అక్కడి నుంచి గాడి తప్పింది. 'నాటకాలు అన్నం పెట్టవు. బాగా చదువుకోవాలి' అని అమ్మ అంటూ ఉండేవారు.

మీ తండ్రి ఎలాంటి పాత్రలు పోషించేవారు?
సాయిమాధవ్‌: మా తండ్రి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి స్త్రీ పాత్రలు ఎక్కువగా చేసేవారు. చింతామణి, సత్యభామ, తార, చంద్రమతి, రోషనార అద్భుతంగా పోషించేవారు.

మీరెంతమంది పిల్లలు?
సాయిమాధవ్‌: నాకు ఒక తమ్ముడు. తను కూడా నాటకాలు రాస్తాడు.. నటిస్తాడు. మా ఇంట్లో అందరూ ఆర్టిస్టులే.

మరి పదో తరగతి తర్వాత ఏం చేశారు?
సాయిమాధవ్‌: తాలూకా హైస్కూల్‌లో మాస్టర్లకు నేనంటే చాలా ఇష్టం. పాఠశాలలో ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే నన్నే ముందు పిలిచేవారు. ఇంటర్మీడియట్‌కు వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చేసింది. దాంతో కాలేజ్‌ ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లేవాడిని. నాకు తెలిసి ఇంటర్మీడియట్‌ రెండేళ్లలో కనీసం 20 రోజులు కూడా కాలేజ్‌లో కూర్చొన్న సందర్భం లేదు. అన్నింటిలోనూ సున్నాలే. ఎలాగో మమ అనిపించా.

మీరేమో సరిగా చదవలేదని చెబుతున్నారు. కానీ, మీ డైలాగ్‌లు వింటే ఎంతో గొప్పగా చదువుకున్న వ్యక్తి రాసినవిలా ఉంటాయి? ఎలా రాయగలుగుతున్నారు?
సాయిమాధవ్‌: క్లాస్‌రూమ్‌లో నాలుగు గోడల మధ్య కూర్చొని, పుస్తకంలో ఉన్నది చదవడమే నిజమైన చదువు అని నేను అనుకోవడం లేదు. ప్రపంచాన్ని చదవాలి. ఆ చదువులు బతుకుతెరువుకు ఉపయోగపడతాయి కానీ, బతుకంటే ఏంటో తెలియజేయవు. ముందు నుంచి నా ప్రయాణమంతా పెద్ద పెద్ద వాళ్లతో సాగింది. నాకంటే వయసులోనూ, జ్ఞానంలోనూ వాళ్లు ఎంతో గొప్పవాళ్లు. వాళ్లతో మాట్లాడుతుంటే జీవితమంటే ఏంటో తెలిసేది. అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.

మీరు రాసిన మొదటి నాటకం?
సాయిమాధవ్‌: 'బ్రోచేవారెవరురా'. సమాజంలో ఉన్న సమస్యలను పాత్రలుగా మలిచా. నిరుద్యోగం, వరకట్నం, మద్యపానం ఇలా ఒక్కో సమస్యకు ఒక్కో పాత్ర ఉంటుంది. వాళ్లకు తండ్రి సమాజం. కూతురు భారతి. ఈ సమస్యలన్నీ దాటుకుని ఆ భారతికి పెళ్లి చేయాలి? అది ఎలా జరిగిందనే ఇతివృత్తంతో ఈ కథ సాగుతుంది. 'అద్దంలో చందమామ' నాటిక నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్. నేటి యువతరానికి అద్దం పట్టేలా దాన్ని రాశా. చాలా మంచి పేరు వచ్చింది. మొదటి నుంచి నాకు ఇష్టమైన పనే చేశాను. అయితే, నా కలలను సాకారం చేసుకునే మార్గం మాత్రం తెలిసేది కాదు.

ఈ పనికి నేను సరిపోను అని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేదా?
సాయిమాధవ్‌: అవును! నేను ఈ స్థాయిలోనే ఉండిపోయానేంటి? అని అనిపిస్తూ ఉండేది. అప్పటికే పెళ్లయి, పిల్లలు కూడా పుట్టేశారు. దీంతో ఏదైనా సాధించాలని హైదరాబాద్‌కు వచ్చేశా. ఎవరిని కలవాలో తెలిసేది కాదు. నన్ను చూసి, 'నువ్వు రైటర్‌వా' అని అంటారేమోనని భయం. అందుకే ఎవరినీ కలిసేవాడిని కాదు. ఫిలింనగర్‌లో తిరుగుతూ ఉండేవాడిని. నేను తెనాలి నుంచి హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగింది. ఓ మాస్టర్‌గారు. 'ఏరా.. నువ్వు ఏదో సాధిద్దామని, తెనాలి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నావ్‌. అక్కడ నీకంటే గొప్ప రచయితలు లేరనుకున్నావా? కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వాళ్లు తిరుగుతున్నారు. నువ్వు ఏ ధైర్యంతో వెళ్తున్నావు' అని నా మీద ఉన్న ఇష్టంతో అడిగారు. అనవసరంగా జీవితాన్ని పాడుచేసుకుంటానేమోనని భయం. 'మాకు జూబ్లీహిల్స్‌లో ఓ స్థలం ఉంది. దాన్ని వెతుక్కోవడానికి వెళ్తున్నా' అని చెప్పి వచ్చేశా (నవ్వులు)


అప్పట్లో మీ కేరాఫ్ అడ్రస్‌ కృష్ణానగరేనా?
సాయిమాధవ్‌: అవునండీ! తొలిసారి 'అభినందన' అనే టెలిఫిలింకు రాశాను. అది ఈటీవీలో ప్రసారం అయ్యేది. అక్కడి నుంచి రెండు, మూడు టెలీ ఫిలిమ్స్‌ చేశాను. అక్కడ నా పనితనం చూసి, 'పుత్తడి బొమ్మ' డైలీ సీరియల్‌కు అవకాశం ఇచ్చారు. సీరియల్‌ అంటే ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోతానేమోనని భయపడి, మళ్లీ ఆలోచించా. నా దృష్టంతా సినిమాపైనే ఉండేది. అప్పుడు ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సాయిబాబుగారు పరిచయం అయ్యారు. అప్పటికి క్రిష్‌ 'వేదం' చేస్తున్నారు. సినిమా గురించి తెలుసు కానీ, అప్పటికి సీరియల్‌ అంటే ఏంటో నాకు తెలియదు.

రచయితకు సినిమాలో ఉన్నంత విస్తృతి సీరియల్స్‌లో ఉంటుందా?
సాయిమాధవ్‌: ఉంటుంది కానీ అపార్థం చేసుకుంటున్నారు. కరెక్ట్‌గా చేస్తే, సీరియల్‌లో ఉన్నంత విస్తృతి సినిమాలో ఉండదు. ఒక సన్నివేశాన్ని సినిమాలో రెండు నిమిషాలకన్నా ఎక్కువగా చూపించకూడదని ఉంటుంది. కానీ, సీరియల్‌లో అలా కాదు. ఒక ఎపిసోడ్‌ చూపించవచ్చు. అయితే, ఇక్కడ సాగదీస్తున్నారు. నేను రెండు ఎపిసోడ్‌లు ఒకే సీన్‌ రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, సాగదీసినట్లు ఉండదు.

'కృష్ణంవందే జగద్గురుమ్‌' రాసేటప్పుడు ఎక్కడైన కష్టంగా అనిపించిందా?
సాయిమాధవ్‌: ఎక్కడా అనిపించలేదు. కొన్ని సన్నివేశాలు వేగంగా రాస్తే, ఇంకొన్ని రాయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. సన్నివేశ ప్రాధాన్యాన్ని బట్టి సమయం తీసుకుంటా. ఏకాగ్రత ఎప్పుడూ ఉంటుంది. దర్శకుడికి నచ్చే వరకూ సన్నివేశాలు రాయాలని అనుకునేవాడిని. ఇష్టంగానే పనిచేశా. తప్ప కష్టంగా పనిచేయలేదు.

పుత్తడిబొమ్మకు ఎన్నిరోజులు పనిచేశారు?
సాయిమాధవ్‌: దాదాపు 350 ఎపిసోడ్‌లకు పనిచేశా. ఆ తర్వాత నాగబాబుగారితో 'శిఖరం', 'సీతామహాలక్ష్మి' సీరియల్స్‌ చేశా. నేను స్క్రీన్‌ప్లే నేర్చుకున్నది అజయ్‌శాంతిగారి దగ్గర. నా పనితనం చూసి క్రిష్‌ నాకు 'కృష్ణం వందే జగద్గురుమ్‌' సినిమా ఆఫర్‌ ఇచ్చారు. అక్కడి నుంచి ఆర్థికంగా నేను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే, అంతకుముందు 'వేదం' కోసం రెండు మూడు డైలాగ్‌లు రాయించారు.

ప్రస్తుతం నిర్మాత డబ్బులిచ్చే మనిషిలా మారిపోయారు.. దీనిపై మీ అభిప్రాయం?
సాయిమాధవ్‌: ఒకప్పుడు నిర్మాతకు కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యం కాదు. కలకాలం ఇండస్ట్రీలో నిలబడి పోవాలి. నా సినిమాలు ఎప్పటికీ నిలిచిపోవాలి అని ఆకాంక్షించేవారు. ఇప్పుడు నిర్మాతల ఆలోచన మారిపోయింది. నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకుంటున్నారు. ఇదొక జూదం అయిపోయింది. మనం సినిమా చేస్తే వస్తాయో రావో తెలియదు. రాకపోతే మరో సినిమా చేయలేరు కదా! మంచి సినిమా అంటే ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలానా హీరోతో, దర్శకుడితో చేస్తే మన డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రస్తుతం నిర్మాతలు ఉన్నారు. దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరి పరిస్థితులు వారికి ఉంటాయి. ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది.

పంచ్‌ డైలాగ్‌ల కోసం మీరెలా వర్క్‌ చేస్తారు?
సాయిమాధవ్‌: కథ, పాత్రను బట్టి డైలాగ్‌లు రాస్తా. ఒక హీరోను ఆ పాత్రలో ముందే మనం చూడగలగాలి. ఆ పాత్రను దాటి రాయలేం. అదే సమయంలో హీరోల ఇమేజ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అంతకుముందు వాళ్లు పలికిన డైలాగ్‌లను కూడా చూడాలి. ఎవరు ఎలా మాట్లాడితే ప్రేక్షకులకు ఇష్టమో దాన్ని కూడా తీసుకోవాలి.

క్రిష్‌తో సినిమా చేస్తూనే ఇంకా ఏయే సినిమాలు చేశారు?
సాయిమాధవ్‌: 'కృష్ణ వందే జగద్గురుమ్‌' తర్వాత 'గోపాల గోపాల', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'దొంగాట', 'రాజుగారి గది', 'కంచె' ఇలా వరుసగా చేసుకుంటూ వచ్చా. మధ్యలో 'స్వాతి చినుకులు' సీరియల్‌కు రాశా. నేను ఎవరికీ ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేయలేదు. అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు. నూతలపాటి సత్యనారాయణగారి దగ్గర మాత్రం సహాయకుడిగా పనిచేశా. నా దగ్గర కూడా సహాయకులు ఉంటారు. వాళ్లు సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం. కానీ, ఎవరూ ఇవ్వరు. వేరే వాళ్లకు కథలో వాళ్లను కూర్చోబెట్టను. నాకు ఏదైనా ఐడియా వచ్చి కథ అనుకుంటే, అప్పుడు వాళ్లతో కూర్చొని మాట్లాడతా.

'ఖైదీ నంబరు 150'లో అవకాశం ఎలా వచ్చింది?
సాయిమాధవ్‌: నాగబాబుగారికి నేనంటే చాలా ఇష్టం. ఆయనతో సీరియల్స్‌ చేశా. నా గురించి కల్యాణ్‌గారికి, చిరంజీవి గారికి చెప్పారు. ఒకరోజు ఫోన్‌ చేసి 'అన్నయ్యతో మాట్లాడు' అన్నారు. అప్పటివరకూ చిరంజీవి గారిని కలవలేదు. దాంతో ఆయన ఫోన్‌ చేయగానే నా చేయి వణికిపోయింది. అంత పెద్ద స్టార్‌ హీరో అయి ఉండి కూడా ఎంతో మర్యాదగా మాట్లాడారు. పిలిస్తే వెంటనే ఆయన ఆఫీస్‌కు వెళ్లా. 'మనం ఒక రీమేక్‌ చేస్తున్నాం. నీతో పాటు వేమారెడ్డి అని మరో రచయిత కూడా పనిచేస్తారు. మీకు అభ్యంతర లేకపోతే మాతో కలిసి పనిచేయవచ్చు' అన్నారు. 'సర్‌. మీ సినిమాలో ఒక్క డైలాగ్‌ రాయమన్నా రాస్తా' అని చెప్పా. ఆ తర్వాత వెంటనే 'సైరా' చేస్తానని అనుకోలేదు. 12ఏళ్ల నుంచి ఆ సినిమా చిరు చేస్తారని అనేవారు కానీ, దానికి సంభాషణలు రాస్తానని నేను అనుకోలేదు.

సంభాషణలతో నరసింహారెడ్డి పాత్రను ఎలా ఎలివేట్‌ చేశారు?
సాయిమాధవ్‌: అదంతా కథలోనే ఉంది. నాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ గురించి కొంత తెలుసు. అయితే, సురేందర్‌రెడ్డిగారు కథ చెప్పినప్పుడు నాకు తెలిసింది కొంచెమేనని అర్థమైంది. ఉయ్యాలవాడ జీవితంలో అండర్‌లైన్‌ చేయాల్సిన పాయింట్‌ ఏంటంటే.. ఆయన తల నరికి కోట గుమ్మానికి 30ఏళ్లు వేలాడదీశారు. ఒక మనిషికి ఇంకో మనిషి మీద అంత కోపం ఎందుకు వస్తుంది? తల నరకేసి 30ఏళ్లు వేలాడతీద్దామన్న ఆలోచన ఎవరికీ ఉండదు. అంటే దాని వెనుక ఏదో కథ ఉందని అర్థమైంది. దాన్ని బ్రిటిషర్లు వేలాడ దీశారు కాబట్టి, అది మంచి తల అయి ఉంటుంది. అది బ్రిటిషర్లను ఎదరించిన తల. వారిపై తల ఎగరేసిన తల. కాబట్టే అన్నేళ్లు తల వేలాడింది. మనకు చాలా మంది ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ ఉన్నారు. కానీ, వాళ్లను ఎవరినీ ఇలా చంపలేదు. అందుకే దీని వెనుక బలమైన కథ ఉందని నమ్మా. సురేందర్‌రెడ్డి నన్ను కూర్చోబెట్టి సీన్‌ బై సీన్‌ చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది.

'సైరా'రాసినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏంటి?
సాయిమాధవ్‌: చాలా సంతోషంగా అనిపించింది. సురేందర్‌రెడ్డి ఎంత గొప్ప దర్శకుడో ఈ సినిమాతో రుజువైంది. అంతకుముందు సురేందర్‌రెడ్డి వేరు. నాలుగు ఫైట్‌లు.. కామెడీలు చేసిన దర్శకుడు ఈ సినిమా ఎలా చేయగలడు? 'అసలు చారిత్రక చిత్రం ఏంటి? సురేందర్‌రెడ్డి ఏంటి?' అని నా ఎదుటే అన్నవాళ్లు ఉన్నారు. సినిమా చేయగలడన్న నమ్మకం ఆయనతో కూర్చొన్న రెండో రోజే కలిగింది. సురేందర్‌రెడ్డితో సింక్‌ కావడం కష్టం. ఒకసారి కలిస్తే, ఇక పని ఈజీ అయిపోతుంది. సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడానికి చరణ్‌బాబు కారణం. రెండున్నరేళ్ల పాటు తీస్తే, యూనిట్‌లో ఒక్క చిన్న వివాదం కూడా లేదు.

'మహానటి'కి డైలాగ్‌లు రాస్తుంటే జర్నీ ఎలా సాగింది?
సాయిమాధవ్‌: దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నన్ను పిలిచి, సావిత్రి బయోపిక్‌ చేద్దామని అన్నప్పుడు నేను నమ్మలేదు. 'ఇతను చూస్తుంటే కుర్రాడిలా ఉన్నాడు. సావిత్రిగారి బయోపిక్‌ ఎలా తీస్తాడు?' అనుకున్నా. అయితే, ఆమె గురించి నాగ్‌ అశ్విన్‌ ఎంతో పరిశోధన చేశారు. అవన్నీ చూసిన తర్వాత ఈయన మాత్రమే సావిత్రి బయోపిక్‌ తీయగలడనిపించింది. 'మహానటి'తో గొప్ప గొప్ప నటుల పాత్రలకు సంభాషణలు రాసే అవకాశం నాకు వచ్చింది. కొన్ని సన్నివేశాలు రాస్తుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చేవి. రెండు మూడు రోజుల పాటు అదే సన్నివేశం నన్ను వెంటాడుతూ ఉండేది. పేపర్‌పై కన్నీళ్లు పడకుండా డైలాగ్‌లు రాసిన సందర్భాలు చాలా తక్కువ.

ఈ అనుభవం ఎన్టీఆర్‌ బయోపిక్‌కు ఉపయోగపడిందా?
సాయిమాధవ్‌: అవునండీ! చిన్నప్పటి నుంచి నాకు ఎన్టీఆర్‌ అంటే విపరీతమైన అభిమానం. ఆయన బయోపిక్‌కు సంభాషణలు రాస్తున్నన్న ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేను. అదో అద్భుతమైన వరం. అయితే, అనుకున్నంత చేయలేకపోయాం. ఆయన జీవితం లార్జర్‌ దేన్‌ లైఫ్‌. ఆడియన్స్‌ అంచనాలను అందుకోలేకపోయాం. బయోపిక్‌ అంటే రెండు రకాలుగా చూడాలి. ఒకటి వాళ్లకు తెలియనిది చెప్పాలి. తెలిసినదాన్ని వాళ్లకు తెలిసినదాని కన్నా బాగా చెప్పాలి. ఈ రెండూ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో జరగలేదు.

ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు రాస్తున్నారు కదా! ఎలా ఉంది?
సాయిమాధవ్‌: చాలా సంతోషంగా ఉంది. సినిమా విషయంలో స్పష్టమైన విజన్‌ ఉన్న దర్శకుడు రాజమౌళి. సినిమాను ఆయన మనోఫలకంలో ఎప్పుడో చూసేశారు. ఆయన చూసేసిన సినిమాను జనానికి చూపించడానికి చేయాల్సింది చేస్తున్నారంతే. ఏ సీన్‌లో ఎంత డైలాగ్‌ ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఆయన ఆత్మను పట్టుకోగలిగితే చాలు. 'రాజమౌళిగారితో పనిచేస్తున్నాం.. చాలా గొప్ప దర్శకుడు.. ఎలా ఉంటుందోనని భయపడ్డా' కానీ, అసలు చాలా ఈజీగా జరిగిపోయింది. సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నా, కథను బట్టే వాళ్లకు డైలాగ్‌లు ఉన్నాయి. కథలో ఆ బ్యాలెన్స్‌ ఉంది. సగం పని రాజమౌళిగారే పూర్తి చేస్తారు.

మీరు రాసిన సంభాషణల్లో మిమ్మల్ని కదిలించింది?
సాయిమాధవ్‌: నాకు మనసుకు నచ్చితేనే ఏ డైలాగ్‌ అయినా రాస్తా. అయితే, 'కృష్ణంవందే జగద్గురమ్‌'లో 'అమ్మ తొమ్మిది నెలలు కష్టపడితే పుట్టామని అనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కలో పది నిమిషాలు సుఖ పడితే పుట్టామని అనుకుంటారు ఇంకొందరు. పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు. పడక సుఖం చూసిన వాడు పశువు అవుతాడు' ఈ డైలాగ్‌లో నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అలాగే 'సైరా'లో 'ఈ దేశం చేసిన యుద్ధం పురాణం అయ్యింది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసం అయింది. యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలా పుడుతుంది. ఇకపై నేను యుద్ధాన్ని. స్వేచ్చకోసం కాలిన దేహమే దేశమవుతుంది. ఇకపై నేను దేశాన్ని' అంటూ క్లైమాక్స్‌లో వస్తుంది.

మిమ్మల్ని కదిలించిన మాటల రచయిత ఎవరు?
సాయిమాధవ్‌: ఆత్రేయగారు. ఆయనంటే బాగా ఇష్టం. ముళ్లపూడి వెంకటరమణగారు, గణేశ్‌పాత్రో వీరంతా ఇష్టమే!

హాస్యంతో కూడిన సినిమాలకు సంభాషణలు రాయాలని లేదా?
సాయిమాధవ్‌: అవకాశం వస్తే తప్పకుండా రాస్తా.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top