Saturday, 28 Mar, 5.50 pm ఈనాడు

తాజా వార్తలు
ఇప్పుడతడు డైపర్లు మారుస్తుంటాడు..

కలీస్‌పై స్టెయిన్‌ సరదా వ్యాఖ్యలు..

డర్బన్‌: వరుసగా ఆడాల్సిన టోర్నీలన్నీ ఉన్నపళంగా రద్దయిపోయాయని దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్‌ డేల్‌స్టెయిన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇటీవల టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో చాట్‌ చేసిన అనంతరం అభిమానుల కోరిక మేరకు డేల్‌స్టెయిన్‌తో వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ జరిగింది. స్టెయిన్‌ మాట్లాడుతూ తాను పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) నుంచి అర్ధాంతరంగా ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో చెప్పాడు. పీఎస్‌ఎల్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్ తరఫున ఆడుతున్న తాను కరోనా కారణంగానే వెళ్లాల్సి వచ్చిందని వివరించాడు. 'పీఎస్‌ఎల్‌ సెమీఫైనల్స్‌కు ముందురోజు నా మేనేజర్‌ సడన్‌గా నా రూమ్‌కు వచ్చి లగేజ్‌ సర్దుకోమని చెప్పాడు. కరోనా విస్తరిస్తున్న కారణంగా వెంటనే స్వదేశానికి బయలుదేరాలని బోర్డు చెప్పిందని నాతో అన్నాడు. గంటలోనే ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలని చెప్పాడు. తర్వాతి రోజు మ్యాచ్‌ ప్రారంభానికి ముందే నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా' అని స్టెయిన్‌ వివరించాడు. కాగా, పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో సెమీఫైనల్స్‌కు సరిగ్గా గంట ముందు పీఎస్‌ఎల్‌ టోర్నీని వాయిదావేశారు.

ఈసారి ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరఫున ఆడుతున్నట్లు స్టెయిన్‌ తెలిపాడు. దీంతో విరాట్‌కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, ఆరోన్‌ ఫించ్‌ లాంటి క్రికెటర్లను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానన్నాడు. ఐపీఎల్‌ తర్వాత శ్రీలంకకు వెళ్లాల్సి ఉందని, ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉందని ఆర్సీబీ పేసర్‌ చెప్పాడు. ఆ టోర్నీలన్నీ ఇప్పుడు మాయమయ్యాయని వాపోయాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తాను ఇంట్లోనే ఉంటూ తన పనులు తాను చేసుకుంటానని స్టెయిన్‌.. పీటర్సన్‌కు వివరించాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఐసోలేషన్‌లో ఉండడానికి ఇష్టపడని క్రికెటర్‌ ఎవరని అడిగితే స్టెయిన్‌.. జాక్వెస్‌ కలీస్‌ పేరు చెప్పాడు. కలీస్‌ ఇటీవలే తండ్రి అయ్యాడని, ఇప్పుడతడు చిన్నారికి డైపర్లు మారుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top