Monday, 15 May, 6.12 am ఈనాడు

విజయనగరం
జంఝావతి నీరు ప్రశ్నార్థకమే!


త్వరలో పనులు ప్రారంభించే అవకాశం
ఖరీఫ్‌లో పాత ఆయకట్టుకు ఇచ్చే వీలు
న్యూస్‌టుడే, పార్వతీపురం
పార్వతీపురం డివిజనులో అయిదు మండలాలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నిర్మించిన జంఝావతి జలాశయం నుంచి ఈ ఖరీఫ్‌ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.39కోట్లతో చేపట్టాల్సిన పనులను గుత్తేదారుకు అప్పగించే ప్రక్రియ మొదలైందని, త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ఇంజనీరింగు అధికారులు చెబుతున్నార¹ు. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో గుత్తేదారుల ఖరారులో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా ఇంతవరకు పనులు చేపట్టడానికి వీలు పడలేదు. కొత్తగా ఖరారైన గుత్తేదారులకు పనులు అప్పగిస్తున్నట్లు లేఖ రాస్తున్నట్లు జంఝావతి కార్యనిర్వహక ఇంజనీరు భాస్కరరావు ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.

చేపట్టాల్సి పనులివీ...
జంఝావతి జలాశయం కింద పూర్తి ఆయకట్టు 24వేల ఎకరాలు. కొమరాడ, పార్వతీపురం సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లో పంటభూములకు సాగునీరు అందించేందుకు వీలుగా కాలువ తవ్వకం, నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం 20వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనులు నిర్వహించాలి. గత గుత్తేదారులు సులువుగా పని జరిగిన చోట మట్టిపనులు పూర్తిచేసుకొని నాలుగురాళ్లు వెనుకేసుకున్నారు. ఇప్పుడు కాలువలను అనుసంధానించే పనులన్నీ పూర్తిచేయడానికి 20వేల క్యూబిక్‌మీటర్లు మట్టిపని చేయాల్సి ఉంది. ఇందుకు చేపట్టడానికి యంత్రాలు అవసరమవుతాయి.

కాలువలో సిమెంటు కట్టడాలు (స్ట్రక్చర్లు) 400 వరకు నిర్మించాలి. ఇప్పటికే సాగునీరు అందుతున్న ప్రాంతంలోనూ, అందని ప్రాంతాల్లోనూ వీటిని చేపట్టాల్సి ఉంది.
ఇవి కాకుండా గతంలో చేపట్టిన నిర్మాణాలకు అనుబంధంగా చేపట్టాల్సిన పనులు వంద వరకు ఉంటాయి. వీటిని కూడా కొత్త గుత్తేదారులు పూర్తిచేయాల్సి ఉంది.

జాప్యం ఎందుకంటే..
టెండర్లు ప్రక్రియ పూర్తయి దాదాపు ఏడాది కాలం గడుస్తోంది. గతంలో నిర్వహించిన టెండర్లలో కాకినాడకు చెందిన సిరి కనస్ట్రక్షన్సు పనుల నిర్వహణకు ఎల్‌.1గా వచ్చింది. అయితే.. టెండర్లు దాఖలు చేసిన సమయంలో సంబంధిత సంస్థ అర్హతలకు నిర్థేశించిన పత్రాలు జతచేయడంలో విఫలమైనట్లు చెబుతున్నారు. దీంతో కొత్త గుత్తేదారును ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈప్రక్రియ పూర్తికావడానికి సమయం పట్టింది. ప్రస్తుతం ఎల్‌.2గా ఉన్న ఆర్‌కెఎన్‌ సంస్థకు పనులు చేపట్టే అవకాశం వచ్చింది. ఈసంస్థతో ఇంజనీరింగు అధికారులు ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. కమిషనరేట్‌ ఆప్‌ టెండర్లు అనుమతి తీసుకున్నామని ఇంజనీరింగు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే టెండరు ఖరారైన విషయాన్ని సంస్థకు తెలియజేసి, పనులు ప్రారంభించేందుకు రావాల్సిందిగా కోరినట్లు ఈఈ భాస్కరరావు తెలిపారు.

పనులు ప్రారంభమైతే..నీటికి ఇబ్బందులు తప్పవా?
జంఝావతి పనులు ప్రారంభిస్తే..ఖరీఫ్‌ పంటలకు సాగునీరు సరఫరా విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చునని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి జలవనరులశాఖలో పనులు చేపట్టేందుకు అనుకూలమైన కాలం డిసెంబరు నుంచి జూన్‌ వరకు ఉన్న ఏడునెలలే. వేసవిలో చేసుకుంటే పనులు పరుగులు తీస్తాయి. దీనికి తోడుగా రైతుకు నీరు అవసరం అంతగా ఉండదు. అయితే పనులు చేయడానికి అనుకూలమైన కాలమంతా ముగిసిపోయింది. ఇప్పుడు ప్రారంభిస్తే.. సాగునీరు అందివ్వాల్సిన సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

భూసేకరణ వేగంగా చేయాలి
కాలువల పనులు నిర్వహణకు ఇంకా భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. భూసేకరణ నిమిత్తం రూ.కోటి వరకు కేటాయించారు. దాదాపు 17 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రెవెన్యూశాఖ చురుకుగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శ ఉంది. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి వద్ద నిర్మిస్తున్న సాగునీటి పథకానికి భూసేకరణే ఇంకా పూర్తిచేయలేదు. కొత్తగా జంఝావతి ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఏమేరకు సేకరించి అప్పగిస్తారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం
జంఝావతి ప్రాజెక్టు పనులను ప్రారంభించాల్సిందిగా ఎల్‌.2గా నమోదైన ఆర్‌కెఎన్‌ సంస్థకు కోరాం. కొద్దిరోజుల్లో సంస్థ స్పందించి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రైతులకు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించేందుకు కార్యాచరణ చేపడతాం. జంఝావతి నుంచి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

-భాస్కరరావు, కార్యనిర్వాహక ఇంజనీరు

Dailyhunt
Top