Thursday, 29 Jul, 5.16 am ఈనాడు

చిత్తూరు
'కాల్‌ రూటింగ్‌'తో హైటెక్‌ దందా

పోలీసుల అదుపులో నిందితులు

తిరుపతి(నేరవిభాగం): అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను 'కాల్‌ రూటింగ్‌' ద్వారా స్థానిక కాల్స్‌గా మార్చి సొమ్ము చేసుకుంటున్న వైనం తిరుపతిలో వెలుగు చూసింది. అంతర్జాతీయ కాల్స్‌ దుర్వినియోగంపై కేంద్ర సమాచార శాఖ సమాచారం అందించడంతో తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ శాఖ ఇచ్చిన కొన్ని ఫోన్‌ నంబర్ల సిగ్నల్స్‌ను తిరుపతి నగరంలోని లీలామహల్‌ వద్ద గుర్తించారు. అక్కడి ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని.. వారి నుంచి అధునాతన టెలికాం పరికరం, 128 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైటెక్‌ 'కాల్‌ రూటింగ్‌' దందాపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికుల సహకారంతో .. విదేశాలకు చెందిన కొందరు భారతదేశంలో కొన్ని ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తిరుపతిలో స్థానికుల సహకారంతో అక్రమంగా అత్యాధునిక టెలికామ్‌ సెటప్‌ ఏర్పాటు చేశాడు. విదేశాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌(వీఓఐపీ) పద్ధతి ద్వారా లోకల్‌ కాల్స్‌గా మార్చుతున్నారు. వీటిని కొన్ని సిమ్‌కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తులకు మళ్లిస్తున్నారు. విదేశాల్లోనూ ఇలాంటి విధానాన్నే అనుసరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి కేవలం అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ వెళుతున్నాయన్న అనుమానం ఆయా ఆపరేటర్లకు రాకుండా ఉండేలా.. నిందితులు రోజూ సిమ్‌కార్డులను మార్చుతున్నారు. ఫలితంగా ఆయా దేశాల్లోని ఆపరేటర్లకు గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ(ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టన్స్‌) చేరకుండా వీరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాలకు చేరాల్సిన పన్ను కూడా అందకుండా పోతోంది. ఇలా చేయడం దేశ భద్రతకు ముప్పుగా కేంద్రం పరిగణిస్తోంది. విదేశీ శక్తులతో సంబంధం ఉన్న వ్యక్తి స్థానిక ముఠాలకు అనుసంధానిగా ఉంటాడు. కాల్స్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని విదేశీ శక్తులు ఆ వ్యక్తికి పంపితే.. అతను ముఠా సభ్యులకు చేరవేస్తాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top