Saturday, 28 Mar, 6.10 pm ఈనాడు

తాజా వార్తలు
కాలినడకన బయలుదేరి.. కాటికెళ్లారు

చిమ్మచీకటిగా రహదారులు.. ప్రమాదంలో కూలీల మృతి

ముంబయి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ సొంతూళ్లకు బయలుదేరిన నలుగురు కార్మికులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన ముంబయిలోని విరార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అహ్మదాబాద్‌ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని.. ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ముంబయి నుంచి ఏడుగురు కూలీల బృందం రాజస్థాన్‌లో ఉన్న తమ స్వగ్రామాలకు శుక్రవారం రాత్రి కాలినడకన బయలుదేరింది. అయితే వారిని గుజరాత్‌-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ముంబయిలోని తమ ప్రాంతానికి వెనుదిరిగారు. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం ముంబయి-అహ్మదాబాద్‌ జాతీయ రహదారిపై వీధి దీపాలను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆపివేసింది. దీంతో వారు నడుస్తున్న ప్రదేశం చిమ్మచీకటిగా మారింది. ఇంతలో అటుగా వచ్చిన ఓ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా... మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి విరార్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
జీవనోపాధి కోసం చిన్న చిన్న గ్రామాల నుంచి మహానగరాలకు వలసవచ్చిన కార్మికులు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top