Tuesday, 11 Aug, 3.15 am ఈనాడు

హైదరాబాద్
కళ్లపై నీలికాంతి దాడి!

డిజిటల్‌ వాడకానికీ ఉందో లెక్క

● విద్యార్థుల ఆరోగ్యంపై ఆన్‌లైన్‌ తరగతుల ప్రభావం

● ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌

4-6 వయసు వారికి 90 నిమిషాలకు తక్కువ ఇవ్వాలి. ● 7-12 వయసు గల పిల్లలకు 2 నుంచి 3 విరామాలతో 180-240 నిమిషాలు. ● 12-16 సంవత్సరాల మధ్య గల పిల్లలు 8 గంటలు. ● కంటికి సుమారు 2 అడుగుల దూరంగా స్మార్‌ఫోన్‌ ఉండాలి. ● డెస్క్‌టాప్‌, ల్యాప్‌ట్యాప్‌, టీవీ వంటి పెద్దతెర ఉన్న పరికరాలను ఉపయోగించడం మంచిది. ● సమస్యను అధిగమించేందుకు ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్లు విరామంతో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుల వంక చూడాలి. ● కళ్లజోడు ఉపయోగించే పిల్లలు ప్రిజర్వేటివ్‌ లేని లూబ్రికేటింగ్‌ కంటి మందు చుక్కలను ఉపయోగించవచ్ఛు

నిన్నటి వరకూ పెద్దలు వద్దని వారించిన స్మార్ట్‌ఫోన్‌.. నేడు చదువుకు ఆధారంగా మారింది. గంటలకొద్దీ వాటిని పిల్లల చేతులకు ఇవ్వాల్సి వస్తోంది. కరోనా వల్ల పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ బోధనా తరగతులు నిర్వహిస్తున్నాయి. తద్వారా కొంత ఉపశమనం లభించినట్టుగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లలు మొబైల్‌ ఫోన్‌, ఐప్యాడ్‌, ల్యాప్‌ట్యాప్‌ వినియోగిస్తున్నారు. అధిక సమయం వీటిపై దృష్టి ఉంచటం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరగటం వల్ల పిల్లల్లో దృష్టి లోపాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఎల్‌వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌) అధ్యయనంలో గుర్తించారు.

ఎందుకీ సమస్య.. ఆన్‌లైన్‌ తరగతులతో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరిగింది. దీర్ఘకాలం వీటిని ఉపయోగించటం, పగటి వెలుతురుకు పిల్లలు దూరమవుతున్నారు. దీనివల్ల మయోఫియా (దగ్గర దృష్టి) సమస్యకు దారి తీయవచ్ఛు ఆన్‌లైన్‌ తరగతులకు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌, ఐప్యాడ్‌ తదితర పరికరాల నుంచి వచ్చే నీలికాంతి తరంగాలు వెలువడతాయి. ఇవి శరీరంలో సిర్కాడియన్‌ పనితీరుకు కారణమైన మెలటోనిన్‌ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఎక్కువకాలం నీలికాంతికి అలవాటు పడటం ద్వారా నిద్రలేమి సమస్య తలెత్తవచ్ఛు కళ్లు తడారిపోవటం, తలనొప్పి, మానిసక ఒత్తిడి, ఆందోళన వంటివి దరిచేరే ప్రమాదం ఉంది. భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయి కొన్ని సమయాల్లో మానసిక సమస్యలకు గురికావచ్చంటూ అధ్యయనంలో గుర్తించారు. ఇవన్నీ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయంటున్నారు. ఎదిగే వయసులో పిల్లల మానసిక, శారీరక, వ్యక్తిత్వ అభివృద్ధి మధ్య సమతుల్యత చాలా అవసరమంటున్నారు.

పిల్లలను వీలైనంత వరకూ మొబైల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. తీరక సమయాల్లో కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు ఎక్కువ సమయం వారితో గడపాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు కేవలం తరగతులకే పరిమితం చేయాలి. ఉపాధ్యాయులు కూడా ప్రతిరోజూ ఆన్‌లైన్‌ బోధనలో కనీసం కొద్ది సమయం శారీరక వ్యాయామం, యోగ, నృత్యం, వర్చ్యువల్‌ వ్యాయామం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్ఛు ఇది పిల్లల మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. హోంవర్క్‌ కోసం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉపయోగించేలా ప్రత్యామ్నాయ మార్గం సూచించవచ్ఛు పిల్లలు ఆరోగ్య ఎదుగుదలలో కుటుంబ సభ్యులు, గురువులు, వైద్యుల సమష్టి బాధ్యత. మారతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే వారి భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

- డాక్టర్‌ రమేష్‌ కకున్నయ, విభాగాధిపతి, ఛైల్డ్‌సైట్‌ ఇనిస్టిట్యూట్‌, ఎల్‌విప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top