Friday, 26 Feb, 1.56 pm ఈనాడు

తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలేవి?

ఉన్నవి ఊడగొడుతోంది
తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: రెండుకోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాటతప్పిందని, కొత్తవి ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ కొలువులన్నీ ఊడగొడుతోందని తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. తెలంగాణలోనూ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రాకుండా యువత ఉపాధికి అడ్డుకట్ట వేసిందన్నారు. ఎమ్మెల్యేలు వివేకానంద, సైదిరెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు,శ్రీనివాస్‌రెడ్డిలు గురువారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ''భాజపా నేతలు ఎప్పుడూ నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడలేదు. తెలంగాణలో అతి తక్కువ సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెరాస. రాష్ట్రం ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో అమెజాన్‌ 23 వేల కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టాడానికి ముందుకు వచ్చింది.. కేసీఆర్‌, కేటీఆర్‌ల ముందు చూపు వల్ల హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించనుంది.

ప్రభుత్వ ఉద్యోగాలపై యువతలో ఉన్న భరోసాను భాజపా, కాంగ్రెస్‌లు భరించలేకపోతున్నాయి. భాజపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు సాధించాలి. కాంగ్రెస్‌లో ఒకరికొకరికి పొంతన లేదు. జానారెడ్డి ఒకటి అంటే దాసోజు శ్రవణ్‌ మరోటి చెబుతున్నారు.ఎవరైనా ప్రభుత్వాన్నీ విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై పూర్తిగా సానుకూలత ఉంది. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌లో స్థానంలో పీవీ కుమార్తె వాణీదేవి ఎంపికపైనా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.'' అని వివేకానంద, సైదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రావులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top