Tuesday, 18 Feb, 1.45 pm ఈనాడు

తాజా వార్తలు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బాటలో కింగ్‌ XI పంజాబ్‌

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోకి అడుగుపెట్టనున్న కింగ్‌ XI

దిల్లీ: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) ఫ్రాంఛైజీ సెంట్‌ లూసియా జౌక్స్‌ను కింగ్స్‌ XI పంజాబ్‌ యాజమాన్యం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందం చేసుకోడానికి తమ సహచర యజమాని మోహిత్‌ బర్మన్‌ అక్కడికి వెళ్లినట్లు ఆ ఫ్రాంఛైజీ ఓనర్‌ నెస్‌వాడియా తెలిపారు. 'సీపీఎల్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఒప్పందం చేసుకోబోతున్నాం. సెంట్‌ లూసియా జట్టును చేజిక్కించుకోబుతున్నాం. బీసీసీఐ అనుమతులొచ్చాకే ఇతర విషయాలను వెల్లడిస్తాం' అని వాడియా అన్నారు. ఈ సందర్భంగా సెంట్‌ లూసియా ప్రధాని అలెన్‌ చస్టానెట్‌, పర్యాటక శాఖ మంత్రి డొమినిక్‌ ఫిడ్డెకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కాగా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యాజమాన్యం 2015లోనే ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో సీపీఎల్‌లో రెండో ఫ్రాంఛైజీగా పంజాబ్‌ యాజామాన్యం అడుగుపెట్టనుంది.

2013లో ప్రారంభమైన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో ఆరు జట్లు ఉండగా, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ ఒక్కటే.. అత్యధికంగా మూడుసార్లు టైటిల్‌ సాధించింది. మరోవైపు విండీస్‌ మాజీ సారథి డారెన్‌ సామీ నేతృత్వంలో కొనసాగుతున్న సెంట్‌ లూసియా 2016లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లీగ్‌లో సెంట్‌ లూసియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. సీపీఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పీట్‌ రసెల్‌ మాట్లాడుతూ.. కింగ్స్‌ XI యాజమాన్యం సీపీఎల్‌లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని, అందుకోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. అలాగే కొత్త యాజమాన్యం నేతృత్వంలో సెంట్‌ లూసియా మంచి విజయాలు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎల్‌ 2020 ఎనిమిదో సీజన్‌ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు జరగనుంది.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top