Sunday, 20 Sep, 1.36 pm ఈనాడు

తాజా వార్తలు
కొవిడ్‌ రూల్స్‌ అతిక్రమిస్తే రూ.10లక్షల జరిమానా!

లండన్‌: కరోనా వైరస్ మహమ్మారి విలయానికి ఇంగ్లాండ్‌ మరోసారి ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. తాజాగా రూపొందించిన కొవిడ్‌ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వెయ్యి నుంచి పదివేల పౌండ్ల (దాదాపు రూ.10లక్షలు) వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు వైరస్‌ లక్షణాలున్నవారు కచ్చితంగా పది నుంచి 14రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు. అయితే, నిబంధనలు ఉల్లంఘించే వారిపై వెయ్యి నుంచి పదివేల పౌండ్ల వరకు జరిమానా విధించేందుకు అక్కడి అధికారులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్కడ ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఇప్పటికే బ్రిటన్‌లో రెండోదఫా వైరస్‌ విజృంభణ కనిపిస్తున్నట్లు తాజాగా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. దీంతో ఇంగ్లాండులో చాలా ప్రదేశాల్లో కఠిన నిబంధనలు విధించారు. ముఖ్యంగా పాజిటివ్‌ వచ్చిన వారు లేదా టెస్టింగ్‌, ట్రేసింగ్‌లో భాగంగా అక్కడి ఆరోగ్య కేంద్రం సూచించిన వ్యక్తులు ఇంటికే పరిమితం(సెల్ఫ్‌ ఐసోలేట్‌) కాకుండా బయటకు వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికోసం ప్రత్యేకంగా కొత్త నిబంధనలు రూపొందించారు. ఇప్పటికే ఫ్రాన్స్‌, స్పెయిన్‌తోపాటు యూరప్‌లో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని అభిప్రాయపడ్డారు. వైరస్‌పై పోరులో భాగంగా, ప్రతిఒక్కరు నిబంధనలు పాటిస్తూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం ఒక్కటే మార్గమని ప్రధాని స్పష్టంచేశారు. కొత్త నిబంధనల్లో భాగంగా వివిధ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆరుగురి కంటే ఎక్కువమంది ఒకచోట కలవకూడదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, యూకేలో ఇప్పటివరకు 3లక్షల 93వేల కేసులు బయటపడగా, వీరిలో 41వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top