Sunday, 15 Sep, 3.30 am ఈనాడు

మెదక్
మద్యం అమ్మినా.. కొన్నా భారీ జరిమానా

గొలుసు దుకాణాల జాడ చెబితే నజరానా
సూరారం గ్రామసభలో తీర్మానం

సూరారం(చిన్నశంకరంపేట), న్యూస్‌టుడే: గ్రామంలో గొలుసు దుకాణాల్లో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలకు కళ్లెం వేసేందుకు చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామస్థులు తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే రూ.25 వేలు, కొనుగోలు చేస్తే రూ.15 వేలు జరిమానా విధించటంతో పాటు కేసు నమోదు చేయాలని శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో నిర్ణయం తీసుకున్నారు. గొలుసు దుకాణాల కారణంగా కుటుంబాలు గుల్లవుతున్నాయని, మద్యం విక్రయాలు నిషేధించాలని గ్రామ మహిళలు పట్టుబట్టడంతో ఈ మేరకు నిర్ణయించారు. సర్పంచి నీరజ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహిళల అభిప్రాయానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. దీంతో మద్యం విక్రయాల నిషేధం నేటి నుంచే అమలులోకి రానున్నట్లు పాలకవర్గం ప్రకటించింది. గొలుసు దుకాణాల్లో విక్రయాల జాడ తెలియజేసిన వారికి రూ.5 వేలు నజరానా సైతం ప్రకటించారు. ఈ మేరకు గ్రామసభలో ప్రతిజ్ఞ చేశారు. తెరాస మండలాధ్యక్షుడు పట్లూరి రాజు, రైసస మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీర్మాన ప్రతిని ఎస్‌ఐకు అందిస్తామని సర్పంచి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top