Monday, 14 Jun, 4.43 pm ఈనాడు

Breaking Vishakhapatnam
మూడో దశకు... ముందస్తు ప్రణాళిక

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆధ్వర్యంలో వైద్యాధికారులు మొదటి, రెండో దశల్లో కొవిడ్‌ కేసుల తీవ్రత, మూడో దశపై ప్రభుత్వ వర్గాలు, నిపుణుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికను రూపొందించారు. ఆయా వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపారు. అంశాలను కొవిడ్‌ ప్రత్యేక అధికారి, ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ప్రణాళికలోని వివరాలు ఆయన మాటల్లోనే..

కొవిడ్‌ సేవల వికేంద్రీకరణ...

మూడో దశలో 1.50 లక్షల కేసులు వస్తాయని అంచనా. ఈ దశలో జిల్లాలో కొవిడ్‌ సేవలను వికేంద్రీకరించనున్నారు. దీనికోసం గ్రామ/వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోనున్నారు. అక్కడ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ చేయనున్నారు. జ్వరాల సర్వే సచివాలయ స్థాయిలో జరిగినందున అక్కడే బాధితులను గుర్తించి పరీక్షలు చేయనున్నారు. పాజిటివ్‌ బాధితులను హోం ఐసొలేషన్‌లో ఉంచుతారు. బాధితుల కుటుంబసభ్యులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల వద్ద నిర్ధా.రణ పరీక్షలు చేయాలి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రాపిడ్‌ టెస్టులు చేస్తారు. ఆయా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆర్టీపీసీఆర్‌ కోసం పట్టణాలకు పంపాలి. నగర, పట్టణాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.●

పిల్లల కోసం 620 పడకలు: మూడో దశలో జిల్లాలో 9వేల మంది పిల్లలకు కొవిడ్‌ వచ్చే అవకాశం ఉందని అంచనా. వీరిలో 3500 మందికి ఆసుపత్రి అవసరం ఉంటుందని, అందులో 2800 మందికి ఆక్సిజన్‌, 700 మందికి ఐసీయూ పడకలు అవసరమని భావిస్తున్నారు. పిల్లల కోసం 620 పడకలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 320, ప్రైవేటు ఆసుపత్రుల్లో 300 చొప్పున పడకలు ఉన్నాయి.

ఆసుపత్రుల్లో అన్నీ ఆక్సిజన్‌ పడకలే...●

* ఆక్సిజన్‌ పడకలను 4500 వరకు పెంచాలి. కమ్యూనిటీ ఆసుపత్రి స్థాయిలో 20, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 150 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ/గిరిజన ప్రాంతాలకు చెందిన బాధితులు నగరం వరకు రాకుండానే ఎక్కడిక్కక్కడే వైద్యం అందించాలి. జిల్లాలోని 12 సామాజిక/ఏరియా ఆసుపత్రులకు ఫిజీషియన్‌/పల్మనాలజిస్టులను నియమించనున్నారు. సామాజిక/ఏరియా ఆసుపత్రి వద్ద 24 గంటలూ అందుబాటులో ఉండేలా అంబులెన్సులు ఏర్పాటు చేస్తారు.

* సాధారణ పడకల వల్ల ఉపయోగం లేనందున కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన 77 ఆసుపత్రుల్లో నూరుశాతం ఆక్సిజన్‌ పడకలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రకంగా చేస్తే 7వేల పడకలు అందుబాటులోకి వస్తాయి.

* గీతం, గాయత్రి, ఎన్‌ఆర్‌ఐ వంటి వైద్య కళాశాలల ఆసుపత్రుల్లోని పడకలన్నీ ఆక్సిజన్‌ పడకలుగా మార్పు చేయాల్సి ఉంది. ప్రైవేటు ఆసుపత్రులను ఏరకంగా కొవిడ్‌ సేవలకు సిద్ధం చేయాలనే విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖకి దిశానిర్దేశం చేయనున్నారు.●

* కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ 200, మెంటల్‌కేర్‌ ఆసుపత్రి ఆవరణలోని ఫ్యామిలీ వార్డును పిల్లల కోసం తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ 100 వరకు పడకలు రానున్నాయి. వీజీహెచ్‌లో 20, గీతం, గాయత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రుల్లో 50 చొప్పున, రెయిన్‌బో, ఆర్‌కె చిల్డ్రన్‌, మెడికవర్‌ ఆసుపత్రుల్లో 25 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మరో మూడు ఆసుపత్రులను గుర్తించారు.●

* ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. వంద పడకలు దాటిన ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ట్యాంకు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో 150 టన్నుల ఆక్సిజన్‌ను నిల్వ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. విశాఖ ఉక్కు ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్‌లో జిల్లాకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే దానిలో అధిక శాతం తీసుకోవడం ద్వారా కొరతను అధిగమించనున్నారు. సీఎస్‌ఆర్‌ కింద జిల్లాలోని 22 ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.

* ప్రత్యేకంగా వెంటిలేటర్ల కొనుగోలు: నియోనెటాల్‌ వెంటిలేటర్లు 20 వరకు కొనుగోలు చేయనున్నారు. పెద్దలకు వినియోగించే వెంటిలేటర్లను 5ఏళ్లు దాటిన పిల్లలకు వాడొచ్ఛు 5ఏళ్ల లోపు వారికి కొత్తగా కొనుగోలు చేయాలి. పిల్లలకు అవసరమయ్యే 50 రకాల ఔషధాలు, పరికరాలు సిద్ధం చేయనున్నారు. 'మూడో దశను ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని, ఆగస్టు నుంచి ఆ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంద'ని భావిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ వివరించారు.●

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top