Thursday, 29 Jul, 5.20 am ఈనాడు

గుంటూరు
నాడు 14.. నేడు 7

గురజాల, రెంటచింతల స్టేషన్లలో హాల్ట్‌ లేకపోవడంతో ప్రయాణికుల ఆందోళన

మాచర్ల రైల్వేస్టేషన్‌

మాచర్ల, న్యూస్‌టుడే : పల్నాడు ప్రాంతంలో కీలకమైన మాచర్ల స్టేషన్‌ నుంచి పదహారు నెలల తరువాత ప్రయాణికులతో రైలు రాకపోకలు కొనసాగుతున్నాయి. మాచర్ల-గుంటూరు ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 07782 నంబర్‌తో గుంటూరు వైపు వెళుతోంది. ప్యాసింజర్‌ రైలుగా ఉన్న సమయంలో మాచర్ల-గుంటూరు మధ్య 14 స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఎక్స్‌ప్రెస్‌గా మార్చడంతో 14 స్టేషన్లలో ఆగుతుండగా ఇక నుంచి 7 స్టేషన్లలో ఆగనుంది. కరోనా మొదటి దశలో ఎక్కువ కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిపేశారు. విడతల వారీగా రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ప్యాసింజర్‌ రైలు నిలిపేసే సమయానికి గుంటూరుకు రూ.30గా ఉన్న ఛార్జి ప్రస్తుతం రూ.60కు పెరిగింది. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు రిజర్వేషన్‌ సౌకర్యం ఇంకా అధికారులు ప్రకటించలేదు. ప్రస్తుతం ఉదయం 5:30 గంటలకు, సాయంత్రం 4:30 గంటలకు గుంటూరు దాకా మాత్రమే రాకపోకలు ఉంటాయని ఉన్నతాధికారులు సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని, మాచర్ల నుంచి మధ్యాహ్నం 1.05 గంటలకు నడికూడికి రాకపోకలు సాగించే రైలు విషయంలో ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించాలని వినతి

తాజా ఎక్స్‌ప్రెస్‌ రైలు గతంలో ప్యాసింజర్‌గా ఉన్నప్పుడు మాచర్ల నుంచి ప్రారంభమై రెంటచింతల, గురజాల, నడికూడి, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, గుడిపూడి, పెదకూరపాడు, లింగంగుంట్ల, సిరిపురం, మందపాడు, బండారుపల్లి, గుంటూరులో రైలు ఆగేది. ప్రస్తుతం ఎక్సెప్రెస్‌ రైలును రెంటచింతల, గురజాల తుమ్మలచెరువు, గుడిపూడి, లింగంగుంట, సిరిపురం, మందపాడులో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన గురజాల స్టాప్‌ ఎత్తేయడం, మరోవైపు విద్యాకేంద్రంగా ఉన్న రెంటచింతలకు రైలు నిలపకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి రెంటచింతల, గురజాలలో తప్పనిసరిగా నిలపాలని చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రైలు నిలిపేసింది : 2020 మార్చి 23

మాచర్ల-గుంటూరు మధ్య దూరం : 120 కిలోమీటర్లు

గతంలో మాచర్ల స్టేషన్‌ రోజుకు ఆదాయం : రూ.లక్షకు పైగా

నిత్యం ప్రయాణించే వారు : 1500 నుంచి 2000 మంది

16 నెలల్లో రైల్వేశాఖ కోల్పోయిన ఆదాయం : రూ.6 కోట్లు

ప్రస్తుతం రాకపోకలు సాగించే రైళ్లు : 2

ప్యాసింజర్‌గా ఉన్న సమయంలో మాచర్ల-గుంటూరు మధ్య రైలు నిలిచే స్టేషన్లు: 14

ఎక్స్‌ప్రెస్‌గా మారిన తరువాత ఆపే స్టేషన్లు : 7

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top