Thursday, 29 Jul, 5.40 am ఈనాడు

వరంగల్
నాసిరకమా.. నకిలీనా..?

మొలకెత్తని మిర్చి విత్తనాలతో ఆందోళన

పరిహారం ఇవ్వాలని వేడుకోలు

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌,

న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌

రైతులకు నాసిరకం విత్తనాలను విక్రయించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. దానిలో భాగంగా వానాకాలం సీజన్‌ ప్రారంభంలో పోలీసులు, వ్యవసాయాధికారులు దుకాణాల్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజాగా కురవి మండలం జగ్యాతండా, మహబూబాబాద్‌ పట్టణంలోని సాలార్‌తండాకు చెందిన సుమారు 30 మంది రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు పది రోజులు దాటినా మొలకెత్తడం లేదని లబోదిబోమంటున్నారు. నాసిరకం విత్తనాలను అంటగట్టారంటూ మంగళవారం జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ వ్యాపారులను డిమాండ్‌ చేశారు. గతేడాది విపణిలో మిర్చికి మంచి గిట్టుబాటు ధర పలకడంతో జగ్యాతండా, సాలార్‌తండాల్లోని రైతులు ఈసారి పత్తికి బదులు మిర్చిని ఎక్కువగా సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో రైతు రెండు నుంచి నాలుగు ఎకరాల్లో పండించాలనుకున్నారు. ఇందుకు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో వివిధ కంపెనీ ప్యాకెట్ల ధరలు రూ.950, రూ.800, రూ.650 చొప్పున సుమారు 100 ఎకరాలకు సరిపడా వెయ్యి విత్తన ప్యాకెట్లను రూ.ఏడు లక్షల వరకు వెచ్చించి విత్తారు. అయితే పది రోజులైనా మొలక రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు న్యాయపరంగా వెళితే కొంతకాలం పట్టవచ్చని పలువురు పేర్కొనగా, దుకాణాదారులు నష్టపరిహారంగా మళ్లీ నాణ్యమైన విత్తనాలను ఇస్తే సరిపోతుందని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇవే విత్తనాలను కొనుగోలు చేసిన వేరే గ్రామాల్లోని రైతులకు కొద్దికాలం తరువాత ఇలాంటి పరిస్థితులే ఎదురుకావొచ్చని భావిస్తున్నారు.

ఎలా గుర్తిస్తారంటే..

రైతు నాటిన విత్తనం మొలకెత్తనప్పుడు మొదట వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. వారు పరిశీలన చేసి సంబంధిత విత్తన శాస్త్రవేత్తకు సమాచారం పంపిస్తారు. ఆయన పొలం వద్దకు వచ్చి స్థానిక వాతావరణ పరిస్థితులు, మట్టి పరీక్షలు చేసి అసలు సమస్య ఎక్కడుందో గుర్తిస్తారు. ఇదే సమయంలో కొనుగోలు చేసిన దుకాణంలో లాట్‌కు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంటే నమూనాలు తీసుకుని నాసిరకమా, నకిలీదా అన్నది గుర్తిస్తారు. ఈ రెండు దశల్లో శాస్త్రవేత్త ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒకవేళ నకిలీదని తేలితే కంపెనీతో పాటు డీలర్‌పై చర్యలు తీసుకుంటారు. రైతులకు పరిహారం ఇప్పిస్తారు. ఇలా కాకుండా రైతులు నేరుగా వినియోగదారుల ఫోరాన్ని కూడా ఆశ్రయించవచ్ఛు వారు కూడా విత్తన శాస్త్రవేత్త ఇచ్చే నివేదిక ఆధారంగా రైతులకు న్యాయం చేస్తారని ఓ వ్యవసాయాధికారి తెలిపారు.

ఇక్కడ కొత్తగా మిర్చి విత్తనాలను నాటేందుకు మడులను తయారు చేస్తున్న రైతు బానోతు తులిస్యా. ఇతడిది సాలార్‌తండా. 'మూడున్నరెకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేసేందుకు మొదట రూ.20 వేలు పెట్టి 40 మిర్చి విత్తనాల ప్యాకెట్లను తెచ్చి నాటాం. 15 రోజులైనా మొలకెత్తకపోవడంతో నాసిరకం కొనుగోలు చేసినట్లు తెలుసుకుని మళ్లీ హైదరాబాద్‌ నుంచి తెప్పించిన విత్తనాలు మొలకెత్తాయి. జిల్లాలో కొనుగోలు చేస్తున్న ఓ కంపెనీ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తడంలేదు. ఇప్పుడు రూ.ఏడు వేలు పెట్టి 20 ప్యాకెట్ల విత్తనాలు తెచ్చి నాటుకుంటున్నాం. వ్యవసాయాధికారులు స్పందించి నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారుల నుంచి పరిహారం అందేలా చూడాల'ని తులిస్యా కోరుతున్నారు.

రూ.40 వేలు నష్టపోయా..

- లూనావత్‌ వర్ష్యా

జిల్లా కేంద్రంలో రెండు దుకాణాల్లో 40 ప్యాకెట్ల విత్తనాలను రూ.40వేలు పెట్టి కొనుగోలు చేసి నాటాం. మరో 20 రోజుల్లో మిర్చి తోట వేయాల్సి ఉన్నా నారు మొలకెత్తలేదు. మరల నారు పోసుకుని నాటేందుకు నెల రోజు సమయం పడుతుంది. అప్పుడు మొదటి కాత ఆలస్యమవుతుంది. ఇలాంటి దుకాణాదారులపై తగిన చర్యలు తీసుకోవాలి.

మాకేం సంబంధం అంటున్నారు..

- భూక్య కమిలి మహిళా రైతు జగ్యాతండా

మూడెకరాల్లో మిర్చి సాగు చేయడానికి ఒక విత్తనాల దుకాణంలో రూ.35వేలు పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి నాటాను. 15 రోజులు దాటినా మొలకెత్తలేదు. దుకాణాదారుడిని అడిగితే నాకేం సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు మరోసారి కొనుగోలు చేయడానికి రూ.30 వేలు ఖర్చవుతాయి. విత్తనాలకే అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి..

- ఛత్రునాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి

మిర్చి విత్తనాలు మొలకెత్తలేదని దుకాణాదారులు నాసిరకం విత్తనాలు ఇచ్చారంటూ రైతులు మా దగ్గరకు వచ్చినా ఇంకా ఫిర్యాదు చేయలేదు. రాతపూర్వకంగా అందిస్తే ఏవో, ఏడీఏ, శాస్త్రవేత్తలను పంపించి విత్తనాల లాట్‌ తెలుసుకుంటాం. ఎంత మంది కొనుగోలు చేశారు.. ఎంతమందికి నష్టం జరిగిందనే వివరాలను సేకరిస్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top