Tuesday, 30 Jan, 3.35 am ఈనాడు

ప్రకాశం
నవరస వీక్షణ తోరణం


ఒంగోలు సాంస్కృతిక విభాగం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ కళాపరిషత్తు తన జోరు పెంచింది. రోజు రోజుకూ వివిధ కళారూపాలతో నూతనత్వం సంతరించుకుంటూ ప్రేక్షకులను రంజింపజేస్తుండగా- మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనలను తిలకిస్తున్నారు. ఎప్పుడూ ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో గడిపే వారందరికీ కాస్త జనం మధ్యలోకి రావడం, సహజ రీతిన సాగే ప్రజా కళలను ప్రత్యక్షంగా ఆస్వాదించడం ఎనలేని అనుభూతిని కలిగిస్తోంది. కళాకారులను కళాపరిషత్తు అధ్యక్షుడు ఈదర హరిబాబు, భారతీయం కన్వీనర్లు నల్లూరు వెంకటేశ్వర్లు, ఈదర భరత్‌ అభినందించి జ్ఞాపికలు, నగదు బహుమతిని అందించారు. నిర్వాహక కమిటీ సభ్యులు అన్నమనేని ప్రసాద్‌, జజ్జూరి వెంకట్రావు, బొల్లినేని బ్రహ్మయ్య, కంకణాల ఆంజనేయులు, ఎస్డీ ఇస్మాయిల్‌, నాగబోయిన చలపతిరావు, కనమాల రాఘవులు, కోవెలకుంట్ల బాలకోటయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఉషోదయ చిన్నారుల అద్భుత కోలాటం
ముందుగా ఉషోదయ పబ్లిక్‌ స్కూల్‌- ఒంగోలు చిన్నారులు సునీత, అమూల్య, రాము, భవానీ, అజయ్‌ బృందం 44 మంది తమ ప్రిన్సిపల్‌ మేడికొండ రమణకుమారి, నృత్య దర్శకుడు బొమ్మల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాట విన్యాసం చూపరులను కట్టిపడేసింది. సోమవారం రాత్రి అద్దంకి నుంచి అనూష డాన్స్‌ టీచర్‌ సారథ్యంలో లోహిత, దీక్షిత, భవ్య, జాహ్నవి, మేఘన, హర్ష్య, అర్చన బృందం నర్తన అలరించింది. చీమకుర్తి నుంచి వీరు డాన్స్‌ అకాడమీ తరపున వీరు మాస్టర్‌ ఆధ్వర్యంలో బాలు, మల్లి అనే చిన్నారులు లవకుశులుగా తమ నర్తనంతో ప్రశంసలందుకున్నారు.

మరో రావణ బ్రహ్మ ఏకపాత్ర
సామర్లకోటకు చెందిన ఎస్‌.కె.అమీర్‌ మరో రావణ బ్రహ్మ ఏకపాత్రతో ఉర్రూతలూగించాడు. పదునైన సంభాషణలు, హావ భావాలతో ప్రేక్షకులను మెప్పించాడు. వారి ప్రశంసలు అందుకున్నాడు. మిత్ర క్రియేషన్స్‌-హైదరాబాద్‌ వారు ఎస్‌.ఎం.బాషా రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన మరో సాంఘిక నాటిక 'తలుగు' వినూత్నంగా సాగింది. దౌలా, మదార్‌, కరీంసాబ్‌ ,బూబమ్మ, ఎంకారెడ్డి తదితర పాత్రల్లో డి.రాము, పి.శివ, టి,లక్ష్మి సమర్థంగా నటించారు.

కొత్తతరంతో ప్రయాణం
రాఘవ మూవీ మేకర్స్‌-గుంటూరు వారు, విద్యాధర్‌ మునిపల్లె రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన కొత్తనీరు సాంఘిక నాటిక, ఆలోచింపజేసింది. నదిలోకి కొత్త నీరు ఎలా సహజమో, కుటుంబ బాంధవ్యాల్లో కొత్త వ్యక్తులు రావడం అంతే సహజం. వారితో మనం, మనతో వారు కలిసి ప్రయాణిస్తేనే జీవితమనే ప్రవాహం అనురాగ కడలి చేరుతుందని నాటిక స్పష్టం చేసింది. వేముల మోహనరావు, ప్రసాద్‌, యశ్వంత్‌ కుమార్‌, దేవసేన, లహరి తదితరులు పాత్రోచితంగా నటించారు.

Dailyhunt
Top