Sunday, 24 Jan, 4.26 am ఈనాడు

మహబూబ్ నగర్
ఓటీపీతో రేషన్‌ బియ్యంకరోనా నేపథ్యంలో కొత్త విధానం

-న్యూస్‌టుడే, వనపర్తి


ఇలా వేలిముద్రలతో రేషను తీసుకునే విధానానికి చెల్లు

చౌకధర దుకాణాలలో ఇక నుంచి రేషనుకార్డుదారు చరవాణికి వచ్చే ఓటీపీ సంఖ్య ఆధారంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. కరోనా కారణంగా గతంలో మాదిరిగా వేలిముద్రల బయోమెట్రిక్‌ విధానానికి స్వస్తి పలుకునున్నారు. ఇక నుంచి ప్రతి రేషనుకార్డుదారు తన ఆధార్‌కార్డును సమీపంలోని ఏదేని మీ సేవ కేంద్రంలో చరవాణి సంఖ్యతో లింకు చేయించుకోవాల్సిందే. లేకుంటే నిత్యావసర వస్తువులను తీసుకోలేరు. ఫిబ్రవరి నెల నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నందున రేషను లబ్ధిదారులు మరో వారం రోజులలోగా ఆధార్‌కేంద్రం లేదా మీ సేవ కేంద్రాలలో ఆధార్‌కార్డునకు చరవాణి సంఖ్యను లింకు చేయించుకోవాలి. సరకులు తీసుకోడానికి వెళ్లిన చౌకధర దుకాణం డీలరుకు కార్డుదారు చరవాణికి వచ్చిన ఓటీపీ సంఖ్యను చెబితేనే సరకులు ఇస్తారు.

జిల్లాలో అన్ని రకాల కార్డులు మొత్తం 1,64,105 ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో ఇంటి పెద్ద లేదా కుటుంబసభ్యులు ఎవరిదైనా ఒకరి చరవాణి సంఖ్యను ఆధార్‌కార్డుతో అనుసంధానించాలి. అలా అనుసంధానించిన చరవాణికి వచ్చే ఓటీపీ సంఖ్యను డీలరుకు చెబితే సరకులు ఇస్తారు. మొత్తం కార్డుదారులకు 5,46,632 మంది లబ్ధిదారులకు, 5128.88 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా చౌకధర దుకాణాల ద్వారా ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 325 చౌకధర దుకాణాలున్నాయి.

* మొత్తం కార్డులు : 1,64,105

* లబ్దిదారులు : 5,46,632

* ఇచ్చే బియ్యం : 5,128.88 మెట్రిక్‌ టన్నులు

* జిల్లాలోని చౌకధర దుకాణాలు : 325

చరవాణితో అనుసంధానం

రేషనుకార్డుదారులు వారి ఇంటి పెద్ద లేదా కుటుంబసభ్యుల పేరు మీద వున్న చరవాణి సంఖ్యను ఆధార్‌కార్డుతో అనుసంధానించాలి. చరవాణులు లేనివారు వారి సమీప బంధువు లేదా నమ్మకస్తులైనవారి చరవాణి సంఖ్యతో అనుసంధానించాలి. చౌకధర దుకాణంలో ఉన్న పీవోఎస్‌ యంత్రంలో కార్డునంబరును చేర్చగానే ఆధార్‌కార్డుతో అనుసంధానమై ఉన్న చరవాణికి ఆరు అంకెల ఓటిపీ సంఖ్య వస్తుంది. కార్డుదారు తనకు వచ్చిన ఓటిపీ నంబరు చెప్పగా డీలరు యంత్రంలోని ఓటీపీ అడిగే గడిలో సంఖ్యను నమోదు చేసి సరకులు ఇస్తారు.

వెంటనే ఆధార్‌ను అనుసంధానించుకోవాలి : వచ్చే నెల నుంచి రేషనుకార్డుదారులకు కేవలం ఓటీపీ ఆధారంగా సరకులను ఇస్తారు. వారం రోజుల్లోగా కార్డుదారులు చరవాణి సంఖ్యలను ఆధార్‌కార్డులతో అనుసంధానించుకోవాలి. ఓటీపి లేకుండా చౌకధరల దుకాణాలలో డీలర్లు సరకులను ఇవ్వరు. కార్డులు తప్పక చరవాణిలను అనుసంధానించుకోవాల్సిందే.

- రేవతి, జిల్లా పౌరసరఫరాల అధికారి, వనపర్తి

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top