Monday, 14 Jun, 4.21 am ఈనాడు

కరీంనగర్
ఓవైపు తనిఖీలు.. మరోవైపు నకిలీలలు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

చందపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

జిల్లాలో నకిలీ విత్తనాల దందా గుట్టుగా సాగుతోంది. పొరుగున ఉన్న కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు దిగుమతి అవుతున్నాయి. శనివారం రాత్రి పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలోని చందపల్లి గాంధీనగర్‌లో విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్న అంబటి బుద్ధారెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి స్థానిక రైతులకు విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. కాగా అదే రోజు జిల్లాకేంద్రంలోని విత్తన దుకాణాల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విత్తనాల నిల్వ, అమ్మకాల రికార్డులను తనిఖీ చేసినా ఎలాంటి నకిలీ విత్తనాలు లభించకపోవడం గమనార్హం.

నిబంధనలు తూ..చ్‌..!

వాస్తవానికి పంట కాలం ప్రారంభం కావడానికి ముందే విత్తనాల నాణ్యతను వ్యవసాయ శాఖ నిర్ధారించాల్సి ఉంటుంది. కాగా ఇవేవీ పట్టించుకోకపోవడం వల్లే నకిలీల బెడద పెరుగుతుందనే విమర్శలున్నాయి. నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే నిబంధనల ప్రకారం సంబంధిత డీలరు కంటే ముందే తయారీదారుపై 1966 విత్తన చట్టం సబ్‌సెక్షన్‌(1), క్లాజ్‌(బీ అండ్‌సీ)ఆఫ్‌ సబ్‌సెక్షన్‌(2) ఆఫ్‌ 15 కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జిల్లాలో ఇలా నిర్ధారించి తయారీదారులపై కేసులు పెట్టిన దాఖలాలు లేవు. విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయడం లేదు. ముందస్తుగా విత్తన వ్యాపారులకు 'సమాచారం' ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదో తనిఖీలకు వచ్చాం కాబట్టి రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదంటూ నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నమూనాల సేకరణ ఎప్పుడో..

జిల్లావ్యాప్తంగా 297 విత్తన దుకాణాలున్నాయి. ఈ వానాకాలంలో జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 2.05 లక్షల ఎకరాల్లో వరి, 76 వేల ఎకరాల్లో పత్తి, 12 వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు వేస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 35 వేల టన్నుల పత్తి విత్తనాలు అవసరం. కాగా దుకాణాల్లో అసలు, నకిలీ విత్తనాల ప్యాకెట్లు ఏవో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ప్రతి దుకాణంలో విత్తనాల నాణ్యతను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ నిర్వాహకుల నుంచి నమూనా పత్రం సేకరించాలి. తయారీ సంస్థలన్నీ నిర్ధారణ చేసుకున్నాకే విత్తన ప్యాకెట్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి. ప్రతి ప్యాకెట్‌పై బ్యాచ్‌, లాట్‌ నెంబర్లు, కోడ్‌, విత్తన రకం, సంచిలో ఉన్న విత్తనాల బరువు, నాణ్యత, తయారు చేసిన స్థలం, అంకురోత్పత్తి ఇతరత్రా వివరాలన్నీ ముద్రిస్తాయి. వీటి వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ నమునాలు సేకరించి విత్తన పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపి నిర్ధారించాలని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియ ముగిశాకే విత్తనాలను మార్కెట్‌లో రైతులకు విక్రయించేందుకు అనుమతినివ్వాలి. కాగా జిల్లాలో ఈ ప్రక్రియ అమలుకు నోచుకోవడం లేదు.

దందాలో తెరవెనుక అధికారి!

జిల్లాలో కొద్ది రోజులుగా వ్యవసాయ, టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయినా పెద్దపల్లి చందపల్లి ప్రాంతంలో ప్రభుత్వ నిషేధిత మిరపగింజల ప్యాకెట్లు 159, బొబ్బెర్లు 15 కిలోలు, మినుములు 6 కిలోలు కలిపి రూ.1.09 లక్షల విలువైన నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా సదరు వ్యాపారి నుంచి ఇప్పటికే జిల్లావ్యాప్తంగా చాలా మంది రైతులు వివిధ రకాల విత్తనాలు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్ది కాలంగా అనుమతుల్లేకుండా వ్యాపారి విక్రయాలు సాగిస్తున్నా పోలీసులు అరెస్టు చేసేవరకు అటు టాస్క్‌ఫోర్స్‌, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. మండలానికి చెందిన ఓ వ్యవసాయ శాఖ అధికారి సదరు వ్యాపారికి 'అన్ని విషయాల్లో' సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్న బుద్ధారెడ్డిని పోలీసులు విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అనుమానముంటేనే పరీక్షలకు: తిరుమల ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి

విత్తనాల ప్యాకెట్లు మార్కెట్‌కు వచ్చే ముందే వ్యవసాయ శాఖ కమిషనర్‌ నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఆయన అనుమతులతోనే విపణిలోకి విడుదల చేస్తారు. జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 230 విత్తన నమూనాలను దుకాణాల నుంచి మండలాల ఏవోలు, ఇతర అధికారుల సాయంతో నుంచి సేకరించాల్సి ఉంది. నకిలీవనే అనుమానం ఉన్న ప్యాకెట్ల నుంచే ఇలా స్వీకరించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం. కల్తీవని తేలితే సదరు వ్యాపారి, తయారీ సంస్థపై చర్యలు తీసుకుంటాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top