Sunday, 07 Mar, 5.20 am ఈనాడు

గుంటూరు
పల్లె తీరు.. పట్నానికి మేలు

గుంటూరులో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా
సైకిల్‌ తొక్కుతున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, సబ్‌కలెక్టర్‌ మయార్‌అశోక్‌

ఈనాడు, గుంటూరు పంచాయతీ ఎన్నికల్లో సగటున 84.47 శాతం మంది పల్లె వాసులు ఓటుహక్కు వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆ స్ఫూర్తి కొరవడుతుందనే చెప్పాలి. గత ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఆవిషయం స్పష్టమవుతోంది. 2014లో మున్సిపల్‌ పాలకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పట్టణాల్లో సగటున ఓటింగ్‌ 80 శాతంలోపే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతానికిపైగా ఓటేస్తే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 70 శాతంలోపే ఉంది. గెలుపులో ప్రతి ఓటు కీలకమైనందున పట్టణ ఓటరు మేలుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కోరుతుంది.
ఓటు అనే రెండు అక్షరాలకు దేశ గతిని మార్చే శక్తి ఉంది. వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ధనిక, పేద అన్న భావం లేకుండా అర్హులైన అందరికీ ఓటుహక్కు కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. అని అందరూ గుర్తించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఐదేళ్లపాటు ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే నేతలను ఎన్నుకునే సువర్ణావకాశం ఓటుహక్కు కల్పిస్తోంది. పట్టణంలో సింహభాగం విద్యావంతులు నివసిస్తుండటంతో విజ్ఞులైన నేతలను ఎన్నుకోవాల్సి ఉంది. కానీ ఓటు విలువ చాలామందికి తెలియడం లేదు. స్థానిక ఎన్నికల్లో ప్రతిఓటూ కీలకమైనందున ఓటుహక్కు కలిగి ఉండి ఏదైనా కారణాలతో పోలింగ్‌కు దూరమైతే, ఒక్క ఓటుతో అభివృద్ధి కాంక్షించే నేత ఓడిపోయే అవకాశం ఉంది. ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు ఎన్నో చూశాం. పట్టణవాసులు కొందరు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఈనేపథ్యంలో ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యం యువతకు తెలియజేయడానికి అధికార యంత్రాంగం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.


ఓటరు చైతన్యంపై సత్తెనపల్లిలో ప్రదర్శన

మేలుకోవాల్సిన తరుణమిదే..
గుంటూరు నగరపాలకసంస్థతోపాటు తెనాలి, రేపల్లె, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి పట్టణాల్లో ఈనెల 10న పోలింగ్‌ జరుగుతుంది. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరూ పోలింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాల్సి ఉంది. అందరికీ వెసులుబాటు కల్పించాలన్న లక్ష్యంతో పోలింగ్‌ రోజు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు యంత్రాంగం తీసుకుంది. ఇళ్ల వద్దకే వచ్చి ఓటరు స్లిప్పులు అందిస్తున్నారు. ఓటరు స్లిప్పులో ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాలో వివరాలు ఉంటాయి. 2014లో మున్సిపల్‌ పాలకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో చూస్తే పట్టణాల్లో సగటున ఓటింగ్‌ 80శాతంలోపే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు నగరపాలకసంస్థ రెండు నియోజకవర్గాల పరిధిలో 70 శాతంలోపే పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. తమకు నచ్చిన అభ్యర్థి లేరని, పోటీలో ఉన్న వారిలో ఎవరిపైనా నమ్మకం లేదని, నేనొక్కడే ఓటు వేయకపోతే నష్టం రాదని ఇలా పలు సాకులతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. మన ప్రాంత నాయకుడిని ఎన్నుకోవడంలో మన భాగస్వామ్యం ఉండాలి.. మనం ఓటు వేస్తే మన ప్రాంతం నాయకున్ని ప్రశ్నించే హక్కు ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. పట్టణవాసులందరూ ఓటింగ్‌లో పాల్గొని పల్లెవాసుల కంటే తామేమి తీసిపోమని నిరూపించాల్సిన సమయమిదే.

చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
పట్టణాల్లో ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే ఈప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనాలి. ప్రభుత్వం యంత్రాంగం పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఓటర్లకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లుచేశాం. పట్టణ వాసుల్లో ఓటుహక్కుపై చైతన్యం తీసుకువరావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. గుంటూరు నగరంతోపాటు ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని అందరూ ఓటేయాలని కోరుతున్నాం.
- వివేక్‌యాదవ్, జిల్లా కలెక్టర్, గుంటూరు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top