Monday, 16 Oct, 5.23 am ఈనాడు

కరీంనగర్
పర్యటక ప్రాంతంగా రాయికల్‌ జలపాతం


రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌
రాయికల్‌ (సైదాపూర్‌) న్యూస్‌టుడే : సైదాపూర్‌ మండలం రాయికల్‌ గ్రామ శివారు మోయిన్‌ చెరువు సమీపంలోని రాయికల్‌ జలపాతాన్ని కరీంనగర్‌ పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు ఆదివారం ఉదయం సందర్శించారు. ఇక్కడి జలపాతం, గుట్టలు, చెరువు పరిసరాలను వారు నిశితంగా పరిశీలించారు. జలపాతం వద్ద గంట పాటు ఆనందంగా గడిపారు. గుట్టపైకి ఎక్కి అక్కడి అందాలను తిలకించారు. నాలుగు గంటల పాటు జిల్లా పోలీస్‌ అధికారి, పాలనాధికారి ఇక్కడే ఉన్నారు. అల్పాహారం అనంతరం రాయికల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పాలనాధికారి సర్పరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. రాయికల్‌ నుంచి జలపాతం వరకు 3 కి.మీ మేర రహదారి నిర్మాణానికి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన కరీంనగర్‌ కొత్త జిల్లాలో అటవీ ప్రాంతం చాలా తక్కువగా ఉందన్నారు. కొత్త జిల్లాలోని సైదాపూర్‌ మండలంలోనే సుమారు 600 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉందని, తరువాత గంగాధర మండలంలోనే అటవీ ప్రాంతం ఉందన్నారు. మండలంలోని ఆకునూర్‌, రాయికల్‌ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

శతశాతం శౌచాలయాలను నిర్మించుకుంటే సరిపోదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్‌ పాలనాధికారి సర్పరాజ్‌ అహ్మద్‌ రాయికల్‌ గ్రామస్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటికి రెండేసి గేదెలు, ఆవులు పెంచుకోవాలని, పాడి పరిశ్రమగా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. గుట్టల ప్రాంతంలో పాడి పరిశ్రను పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకు రాయికల్‌, ఆకునూర్‌ గ్రామాల రైతులు ముందుకు రావాలని కోరారు.

రాయికల్‌ జలపాతం చూసేందుకు వచ్చే సందర్శకులకు గ్రామస్థులు స్వాగతం పలకాలని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి సూచించారు. జలపాతం వద్ద మద్యం, పేకాట వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. రాయికల్‌లో నిత్యం పోలీసు పెట్రోలింగ్‌కు చర్యలు తీసుకుంటామని అన్నారు. సైదాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు బిల్ల వెంకటరెడ్డి, రాయికల్‌ సర్పంచి పద్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు స్వామి, ఏసీపీ రవీందర్‌రెడ్డి, గ్రామీణ వలయాధికారి రవికుమార్‌, సైదాపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Top