Thursday, 29 Jul, 5.40 am ఈనాడు

వరంగల్
పట్టాలే సాక్ష్యం రైలు మార్గంలో గుర్తు తెలియని మృతదేహాలెన్నో

న్యూస్‌టుడే, కాజీపేట

దూర ప్రాంతాల నుంచి వచ్చే రైలు నుంచి పడి మరణించిన ఘటనల్లోనే గుర్తు తెలియని శవాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడినప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం గుర్తుపట్టకుండా అవుతాయి. కొన్నిసార్లు ముక్కలు మాత్రమే లభిస్తాయి. తల లభించని సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ ఇతర ఆధారాలు లభించవు. ఇలా మరణించిన వారి బంధువుల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారు. కొందరు ఏ రైలులో ప్రయాణం చేశారో తెలియక మిన్నకుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అన్ని పోలీసు స్టేషన్లకు వాకబు చేయడం కష్టం అవుతోంది. మరణించిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి మిన్నకుంటున్నారు. ఫలితంగా మృతులు అనాథ శవాలుగా మిగులుతున్నారు. మే 7న గుర్తు తెలియని 55 సంవత్సరాల వయసు గల వ్యక్తి పెద్దపెండ్యాల సమీపంలో రైలు నుంచి జారిపడి మరణించాడు. ఇతని వద్ద తమిళవార్త పత్రిక ముక్క మాత్రమే ఉంది. ఎలాంటి ఆధారాలు లేవు. జీఆర్‌పీ పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి. 72 గంటల తర్వాత అనాథ శవంగా పంచనామా చేసి ఖననం చేశారు.

ఆధారాలు సేకరణ

గుర్తు తెలియని శవాలను ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి పంపే ముందు వారి మీద ఉన్న ఆధారాలను పోలీసులు భద్రపరుస్తారు. ముఖ్యంగా పుట్టుమచ్చలు, అంగవైకల్యం, ఇతర దెబ్బలకు సంబంధించిన మరకలు, ఎత్తు, రంగు, జుట్టు రంగు ఆ తర్వాత దుస్తులను తీసుకుంటారు. ఇందులో షర్టు, కాలర్‌ మీద ఉన్న టైలర్‌ చిరునామాను బట్టి గుర్తిస్తారు. చరవాణి, అందులో ఫోన్‌ చేసిన వివరాలు, పర్సులోని గుర్తింపు కార్డులను చూసి కూడా వివరాలు సేకరిస్తారు.

72 గంటల్లో ఖననం

రైలు కిందపడి మరణించిన అనాథ శవాన్ని ఆసుపత్రిలో 72 గంటలు మాత్రమే భద్రపరుస్తారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు ఖననం చేస్తారు. ఇలా చేసే ముందు వారి కాలర్‌ బోన్‌(భుజం ఎముకను) తీసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతారు. వీరి వద్ద దాన్ని భద్రపరుస్తారు. చాలా రోజుల తర్వాత బంధువులు వస్తే వారు ఇచ్చిన ఆధారాల ప్రకారం, తేదీ, సమయం ఆధారం చేసుకుని వారు ఖననం చేసిన వివరాలు వెల్లడిస్తారు. తర్వాత వారి తల్లి, తండ్రి లేదా పిల్లల రక్తంతో కాలర్‌ బోన్‌ను డీఎన్‌ఏ పరీక్ష చేస్తారు. రెండు కలిస్తే సదరు బంధువులకు మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. మహబూబాబాద్‌ సమీపంలోని తాళ్లపూసలపల్లి వద్ద జరిగిన గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్ని ప్రమాద సమయంలో ఎక్కువగా డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగానే బంధువులను గుర్తించారు. ఇంకా రెండు శవాలకు సంబంధించిన బూడిద ఇప్పటికీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భద్రంగా ఉంది.

డీఎన్‌ఏతో ..

ఎక్కడినుంచో ప్రయాణిస్తూ ఏ కారణం చేతనో చనిపోతే ఆ శవాలను రెండు రోజులు చూసి మూడో రోజు ఖననం చేస్తారు. తర్వాత వారి బంధువులు వస్తే తీసిన చిత్రాల ఆధారంగా గుర్తిస్తారు. పూడ్చిపెట్టింది కొద్ది రోజులే అయితే కొందరు బొందలో నుంచి శవాన్ని తవ్వి తీసి వారి ఇళ్లకు వెళ్లి దహన సంస్కారాలు చేస్తుంటారు. చాలా రోజుల తర్వాత వస్తే భద్రపరిచిన కాలర్‌ బోన్‌ ఆధారంగా డీఎన్‌ఏ పరీక్ష చేయించి పలానా మనిషి అని గుర్తిస్తారు. రైలు కిందపడి మరణించిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించారా, ఆత్మహత్య, లేదా హత్యా అనే విషయం కూడా సరిగ్గా తెలియదు. సంఘటన స్థలాన్ని బట్టి నిర్ణయిస్తారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top