Tuesday, 27 Jun, 4.44 am ఈనాడు

కృష్ణ
పట్టిసీమ నీటితో డెల్టా రైతుల్లో ఆనందం కృ


ఈనాడు, అమరావతి
కృ ష్ణాకు ఎగువన ప్రాజెక్టుల నిర్మాణంతో నీరు రాక ఇబ్బంది పడుతున్న రైతాంగానికి పట్టిసీమ జలాలు ఆదుకుంటున్నాయని, ఈసారి ఇటీవల ఎన్నడూ లేనంతగా ముందే నీటిని వదిలామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కృష్ణా డెల్టా తూర్పు కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాలో నీరు లేక చివరవరకు ఉన్న కొద్దిపాటి నీరు ఉప్పుగా మారిందన్నారు. సాగు భూములు కూడా చౌడుబారాయన్నారు. గత ఏడాడి 55 టీఎంసీల మేరకు పట్టిసీమ నీటిని ఇవ్వడం వల్ల ఖరీఫ్లో రైతులు ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పంటలు పండించారన్నారు. ఈ ఏడాదితో పాత హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడం ఆపేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త దానితో వదులుతామన్నారు. 112 సంవత్సరాల డెల్టా చరిత్రకు సాక్ష్యంగా ఇది నిలుస్తుందన్నారు. ఇది ఈ ప్రాంత వాసులకు నీరు అందించి నాగరికతను నేర్పిందన్నారు.

అనేక వరదల సమయంలోనూ ఇది తట్టుకుని నిలబడిందన్నారు. ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. బస్టాండు నుంచి రైల్వేస్టేషను వరకు చాలా స్థలం ఉందని, దీన్నంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. అటు కృష్ణా నది..

ఇటు దుర్గమ్మ ఆలయం ఉందని, ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్స్, హోటళ్ల నిర్మాణాన్ని చేపడతామని వివరించారు. మానసికోల్లాసం కోసం కూడా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. దీని వల్ల ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు.

2,500 క్యూసెక్కులు విడుదల: పట్టిసీమ ద్వారా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజిలో నీటి మట్టం 11.2 అడుగులకు చేరింది.

దీంతో తూర్పు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. సుమారు 2,500 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. రైవస్ కాలువకు, బందరు కాలువకు, కేఈబీ కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున, ఏలూరు కాలువకు 1,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే పశ్చిమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ సాగునీటి సంఘాల అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top