Monday, 14 Jun, 5.26 am ఈనాడు

మహబూబ్ నగర్
పొరుగు రాష్ట్రానికి మద్దతు

గద్వాల, పేట జిల్లాల్లోకి కర్ణాటక నుంచి ధాన్యం రాక

చక్రం తిప్పుతున్న లారీల యజమాని

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

పాలమూరు రైతులకు దక్కాల్సిన మద్దతు ధర పక్క రాష్ట్రానికి వెళుతోంది. అక్కడి రైతులు వరి ధాన్యాన్ని అక్రమంగా తెచ్చి ఇక్కడ అమ్ముకోవడంతో లాభపడుతున్నారు. స్థానిక అన్నదాతల ధాన్యం మాత్రం ఇంకా కల్లాల్లోనే మగ్గుతోంది. నిజానికి ఏటా సీజన్‌లో వరి ఏ మేరకు కొనాల్సి ఉంటుందో పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తారు. వరి ఎన్నెకరాల్లో సాగైందో వ్యవసాయశాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని.. దాని ప్రకారం కొనుగోళ్ల లక్ష్యం నిర్ధారిస్తారు. దానికి అటుఇటుగా ప్రతి వానాకాలం, యాసంగిలో కొనుగోళ్లు సాగుతాయి. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారులు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించారు. దానికి తగ్గట్లు ఉమ్మడి జిల్లాలో 803 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. లక్ష్యం కంటే అధికంగా ధాన్యం కొన్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు జిల్లాల సరిహద్దులు పక్క రాష్ట్రాలకు ఆనుకొని ఉండడంతో అక్కణ్నుంచి ధాన్యం ఇక్కడికి తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు కర్ణాటక నుంచి వరి ధాన్యం తరలివస్తోంది. ఇక్కడి రైతుల పేరు మీద కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ యాసంగిలో 49,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 85వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యం మాత్రం ఇంకా కల్లాలోనే దర్శనమిస్తోంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించే ఓ లారీల యజమాని ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయనకు మిల్లర్లతో సంబంధాలున్నాయని పలువురు చెబుతున్నారు. సీఎంఆర్‌ కింద కేటాయించే ధాన్యాన్నీ.. ఈ కొనుగోళ్లలో చూపుతున్నట్లు తెలుస్తోంది. కొందరు దళారుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని కొంటున్న మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌లో భాగంగా ధాన్యం కొనుగోళ్ల కింద చూపించి ఎఫ్‌సీఐ గోదాంలకు పంపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉండడంతో కర్ణాకటలో ధాన్యానికి క్వింటాకు రూ.1200- 1400 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు ప్రభుత్వం రూ.1,888 ఇస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఆ రాష్ట్రం నుంచి ధాన్యం జిల్లాకు వస్తోంది.

* నారాయణపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి. దామరగిద్ద, కృష్ణా, మాగనూరు, మక్తల్‌, నారాయణపేట మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాలకు కర్ణాకట సరిహద్దుల్లో పండించిన ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. అక్కడి రైతులకు జిల్లా వాసులతో బంధుత్వాలు ఉండడంతో వీరి ఆధార్‌కార్డులను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో 96వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇప్పటికే 1.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. అందులో 30 శాతానికిపైగా ధాన్యం కర్ణాటకలోని గుర్మిట్కల్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ క్వింటాకు రూ.1,200 కంటే ఎక్కువ ధర పలకడం లేదు. దీంతో నారాయణపేటకు వివిధ మార్గాల ద్వారా తరలించి ఇక్కడి కొనుగోలు కేంద్రాల్లో అమ్మేస్తున్నారు.

* జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు కర్ణాటక సరిహద్దులతో కలిసి ఉంటాయి. సరిహద్దుల్లో చెక్‌పొస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవాలి. రాయచూరు, గుర్మిట్కల్‌ ప్రాంతాల నుంచి ముఖ్యమైన రహదారి గుండా కాకుండా పల్లెల ద్వారా యథేచ్ఛగా ధాన్యం తరలివస్తోంది. అధికారుల నిఘా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టాం.. : ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టామని జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పౌరసరఫరా శాఖ డీఎంలు ప్రసాదరావు, హథీరామ్‌ 'ఈనాడు'కు తెలిపారు. సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్నారు. కేంద్రాల్లో ఆధార్‌కార్డు, రైతు వివరాలను పరిశీలించాకే కొనుగోళ్లు జరుగుతున్నాయని వారు వివరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top