తాజా వార్తలు
'ప్రభుత్వాన్ని మెప్పించి పీఆర్సీ సాధిస్తాం'

మీడియాతో ఉద్యోగ సంఘాల నేతలు
హైదరాబాద్: ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదికలో పొందుపర్చిన విషయం తెలియగానే తెలంగాణ ఉద్యోగులుగా జీర్ణించుకోలేకపోయామని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెరుగైన వేతనాలు అందుకుంటామని భావిస్తున్న ఉద్యోగులను పీఆర్సీ నివేదిక పూర్తిగా నిరాశకు గురి చేసిందని చెప్పారు. పీఆర్సీ అంటే 'పే రివైజ్' కావాలి కానీ తాజా నివేదికలో 'పే రిడక్షన్' చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పీఆర్సీ నివేదిక చూసిన తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాతిపదికన 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారో అర్థంకాని అయోమయ స్థితిలో ఉద్యోగులందరూ ఉన్నారన్నారు.
''కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిన మాంద్యం నెలకొన్న సమయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా ఉద్యోగులు సహకరించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తామని సీఎం కేసీఆర్ గతంలో మాట ఇచ్చారు. ఆ విధంగానే రాష్ట్రంలోని 9 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం కలగాలి. గతంలో 43 శాతం ఫిట్మెంట్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ సారి కూడా 43 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ని కోరాం. ఎలా అయితే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామో.. రాష్ట్రంలోని ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా మెరుగైన ఫిట్మెంట్ సాధించే దశగా తెలంగాణ ఎన్జీవోల సంఘం ముందుకెళ్తుంది. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రభుత్వాన్ని మెప్పిస్తాం.. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను సాధిస్తాం'' అని రాజేందర్ తెలిపారు.
ఇవీ చదవండి..