Wednesday, 27 Jan, 4.40 am ఈనాడు

వరంగల్
ప్రగతి బాటలో జిల్లా అభివృద్ధి

అదే దిశగా పట్టణాలు, పల్లెలు

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌: ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతిబాటలో పయనిస్తోందని జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ అన్నారు. జిల్లాపై కరోనా ప్రభావం పడినప్పటికీ అందరి సహకారంతో కట్టడి చేస్తున్నామన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే.. మెరుగైన వైద్యం..: జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి గ్రామంలో పారా మెడికల్‌ సిబ్బందితో యాక్టివ్‌ సర్వెలెన్స్‌ చేయిస్తున్నాం. దీనిలో భాగంగా వ్యక్తుల శరీర ఉష్ణోగ్రత, థర్మోస్కాన్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 2,28,377 రాపిడ్‌ టెస్టులు, 11,593 ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు పరీక్షించగా 12,747 పాజిటివ్‌ కెసులు నమోదవగా 12,651 మంది కోలుకున్నారు. ఏరియా ఆస్పత్రిలో 12 పడకలతో ఐసోలేషన్‌ వార్డు, రెండు పడకల ఐసీయూ వార్డు, గూడూరులోని సీహెచ్‌సీలో 40 పడకలతో ఐసోలేషన్‌ వార్డు, 10 పడకల ఐసీయూ వార్డు ఏర్పాటుచేశాం. ఇదే ఆస్పత్రిలో రూ.12 లక్షలతో జనరేటర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ పరికరాలను కొనుగోలు చేశాం. ఎంపీ ల్యాడ్స్‌ రూ.50 లక్షలతో కోవిడ్‌-19 వైద్య పరికరాలు కొనుగోలు చేసి జిల్లా ఆస్పత్రి, గూడూరు ఆస్పత్రికి కేటాయించాం. డీఎంఎఫ్‌టీ నిధులు రూ.45 లక్షలతో రెండు ఏసీ అంబులెన్స్‌లు కొనుగోలు చేసి గూడూరు, ఏరియా ఆస్పత్రిలో అందుబాటులోకి ఉంచాం. డీఎంఎఫ్‌టీ నిధులు రూ.68 లక్షలతో ఏరియా ఆస్పత్రి స్థలంలో 40 పడకల వార్డు నిర్మాణం చేపట్టాం. సీబీఎఫ్‌ రూ.19 లక్షలతో ఆత్యాధునిక నియోనాటల్‌ వెంటీలేటర్‌ కొనుగోలు చేశాం. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో 10 పడకలతో వైద్య సేవలందిస్తున్నాం. కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా మాస్క్‌ ధరించని వారి నుంచి జరిమానా రూపేణా రూ.3.74 లక్షలు వసూలు చేశాం. జిల్లాలో నెలకు సుమారు 300 ప్రసవాలు అవుతున్నాయి. ఏజెన్సీలోని సీహెచ్‌సీలో 200, పీహెచ్‌సీల్లో వెయ్యి ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేశాం. ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చూస్తున్నాం. జిల్లాలో 11,586 కేసీఆర్‌ కిట్లను అందించాం. కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలు అందిస్తున్నాం. 24 గంటలూ అన్ని రక్త గ్రూపులు అందుబాటులో ఉండేలా రూ.1.40 కోట్లతో బ్లడ్‌బ్యాంక్‌ ఏర్పాటు చేశాం.
పల్లెల్లో ప్రగతి ఫలాలు..: జిల్లాలోని 461 పంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్ని నిర్వహించాం. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావారణం అందించేందుకు, గ్రామాలతో పాటు శివారు పల్లెల్లో 702 పల్లెపకృతి వనాలను ఏర్పాటుచేసి 652 పూర్తిచేశాం. వైకుంఠధామాల అభివృద్ధి, విద్యుత్తు మూడో లైన్‌ పనులు, తప్పుపట్టిన స్తంభాల తొలగింపు, వదులుగా ఉన్న తీగలను బిగించే పనులు పూర్తిచేøాం. జిల్లాలో 461 శ్మశానవాటికల నిర్మాణాలు చేపట్టగా 211 పూర్తయ్యాయి. మరో 250 పురోగతిలో ఉన్నాయి. పల్లెపకృతి వనాల్లో మొత్తం 10,25,480 మొక్కలు నాటాం. 461 పంచాయతీల్లో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.93.59 కోట్ల నిధులతో ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ ఏర్పాటుచేసి ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డపింగ్‌యార్డులకు తరలిస్తున్నాం. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్ల విస్తరణ, డివైడర్ల ఏర్పాటు, వీధిదీపాలు, పిల్లల ఉద్యానవనాలు, మోడల్‌ మార్కెట్స్‌, ప్రజా మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నాం.
వ్యవసాయానికి పెద్దపీట..: రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం అమలులోకి తీసుకొచ్చింది. రూ.18.04 కోట్లతో జిల్లాలో 82 రైతువేదికలను నిర్మించాం. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలోని 1,68,237 మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖరీఫ్‌లో రూ.198 కోట్ల నగదును వారి బ్యాంకు ఖాతాలో జమచేøాం. సామూహిక రైతు బీమా పథకంలో భాగంగా 18 ఏళ్లు నుంచి 59 సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి రైతుకు బీమా కల్పించడానికి రూ.1,16,273 మంది రైతులకు పాలసీ ధ్రువీకరణ పత్రాలను అందించాం. వివిధ కారణాలతో ఇప్పటివరకు మృతిచెందిన 187 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.9.15 కోట్లను రైతు నామినీ ఖాతాల్లో జమ చేశాం. ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి తహసీల్దార్లను సంయుక్త సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఈనెల 22 నాటికి జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం 3106 స్లాట్‌లు బుక్‌చేసుకోగా 2997 స్లాట్స్‌ను రిజిస్ట్రేషన్‌ చేశాం. ఏజెన్సీ మండలాలైన బయ్యారం, గార్ల, గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు ఎల్‌ఫాం ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు చర్యలు చేపట్టాం. 296 మందికి ఎల్‌ఫాంను అందించాం. స్లాట్‌ బుక్‌ చేసుకున్న 279 మందిలో 274 మంది స్లాట్లను పరిష్కరించి రిజిస్ట్రేషన్లు చేశాం.
ప్రశంసాపత్రాల అందజేత..: వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్‌ గౌతమ్‌ ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌, జిల్లా అదనపు కలెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, అభిలాషా అభినవ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్‌, పుర ఛైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా , డివిజన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..: కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో పరిమిత సంఖ్యలోనే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, తాండవకృష్ణ అకాడమీకి చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతికాంశాలు అలరించాయి. జానపద, సామాజిక సందేశంతో సాగిన నృత్యాలతో పాటు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్‌ మైదానంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సంస్థ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాళ్లను కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు సందర్శించారు. మహిళా సంఘాల సభ్యులు ఉత్పత్తిచేసి ప్రదర్శించిన నేత వస్త్రాలు, చేతి సంచులు, ఇతర వస్తువులను పరిశీలించిన అధికారులు నిర్వాహకులను అభినందించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఆయిల్‌ ఫాం, ఇతర నూతన పంటల సాగు విధానాలు, దిగుబడులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇంటింటికీ భగరథ జలాలు..: ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాకు ఇంట్రా విలేజీకి సంబంధించి రూ.286.33 కోట్లు మంజూరుచేశారు. వీటితో 1104 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, 394 పాత ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చాం. 1283 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసి 1.80 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీటిని అందిస్తున్నాం. జిల్లాలో 14 మండలాల్లోని 1138 గ్రామీణ ఆవాసాలకు, నాలుగు మున్సిపాలిటీలకు మిషన్‌భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. విద్యా సంస్థలకు కూడా నీటిని సరఫరా చేస్తున్నాం.

మొక్కల పెంపంకంపై ప్రత్యేక దృష్టి..: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఈసారి 1.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లావ్యాప్తంగా 461 పంచాయతీల్లో, నాలుగు మున్సిపాలిటీల్లో నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాం. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. కోతుల ఆహారం కోసం జిల్లాలోని పరిసర అటవీ ప్రాంతాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటుచేశాం. ఆయా చోట్ల అటవీ జాతి పండ్ల మొక్కలను పెంచుతున్నాం. 'జంగల్‌ బడావో-జంగల్‌ బచావో' కార్యక్రమం ద్వారా ఉన్న అడవులను సంరక్షిస్తూ క్షీణించిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాం.
మెరుగైన రహదారులు.. : జిల్లాలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రూ.37 కోట్లతో రహదారి నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టగా ప్రగతిలో ఉన్నాయి. రూ.18 కోట్లతో మూడు పనులు చేపట్టగా 7.40 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం పూర్తి చేశాం. మిగిలిన పనులు అభివృద్ధిలో ఉన్నాయి. రూ.2.40 కోట్లతో ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాల నిర్మాణం ప్రారంభించాం.
ఉపాధికి ప్రాధాన్యం..: జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచాం. గ్రామీణాభివృద్ధి సంస్థ, శ్రీనిధి పథకం ద్వారా 2,617 స్వయం సహాయక సంఘాలకు రూ.34.57 కోట్లు రుణంగా అందించాô. మహిళా సంఘాల సభ్యులతో 2.15 లక్షల మాస్కులను కుట్టించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అందించాం. 216 మంది నిరుపేద యువతకు మార్కెటింగ్‌ మిషన్‌ పథకం ద్వారా శిక్షణ ఇప్పించి 211 మందికి ఉపాధి కల్పించాం. ఉద్యోగమేళా నిర్వహించి 1975 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 42.71 లక్షల పని దినాలు కల్పించి కూలీలకు రూ.61.02 కోట్ల వేతనాలు చెల్లించాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top