Wednesday, 02 Oct, 2.30 am ఈనాడు

మెదక్
ప్రజల మన్ననలు పొందాలి: ఎస్పీ

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: అత్యవసర సమయాల్లో పోలీసు వాహనాల చోదకుల చొరవే అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ చందనాదీప్తి అన్నారు. మంగళవారం మెదక్‌లోని జిల్లా పోలీసు కార్యాలయానికి కొత్తగా వచ్చిన బ్లూకోట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన వాహనాలను ప్రజా సేవలకు వినియోగించాలని చెప్పారు. ప్రజలు సమస్య ఉంటేనే ఠాణాకు వస్తారని, అలాంటి వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రానికి బందోబస్తు నిమిత్తం వివిధ స్టేషన్ల నుంచి వచ్చే సిబ్బంది కోసం మెదక్‌ ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన బ్యారక్‌లను ఎస్పీ ప్రారంభించారు. మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీలు కృష్ణమూర్తి, కిరణ్‌కుమార్‌, జిల్లాకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో శాంతిభద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్‌ కేసులు మెుదలైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేయాలని, అన్ని కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పెండింగ్‌ ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే చోట సూచికలు ఏర్పాటుచేయాలని, ఆయా చోట్ల ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులతో కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా తప్పిపోయారని, కనిపించడం లేదని ఫిర్యాదు అందిన వెంటనే ఆ వ్యక్తి చిత్రాన్ని అన్ని ఠాణాలకు పంపించి ఆచూకీ తెలుసుకునేందుకు యత్నించాలన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top