Friday, 22 Jan, 2.55 am ఈనాడు

ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్
ప్రతి వికెట్టూ.. నాన్నకే అంకితం

ఆస్ట్రేలియాలో సిరీస్‌ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది
నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది
టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తాను తీసిన ప్రతి వికెట్‌ తన తండ్రికే అంకితమని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ఈ చారిత్రక టెస్టు సిరీస్‌ విజయం తనకెప్పటికీ గుర్తుండిపోతుందని.. తన టెస్టు కెరీర్‌కు ఇంతటి గొప్ప ఆరంభం లభించడం సంతోషంగా ఉందని చెప్పాడు. తన అసలైన క్రికెట్‌ ప్రయాణం ఇప్పుడే మొదలైందని తెలిపాడు. కంగారూ గడ్డపై భారత్‌ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ పేసర్‌ గురువారం హైదరాబాద్‌ చేరుకున్నాడు. తన నివాసం దగ్గర విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశవాళీ టోర్నీలైనా.. భారత్‌- ఎ లేదా టీమ్‌ఇండియా తరపున సిరీస్‌లైనా.. అవి ముగిసిన తర్వాత ఇంటికి వస్తే నాన్న ఎదురు వచ్చేవారు. ఆయనతో కూర్చొని మాట్లాడేవాణ్ని. కానీ ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వస్తుంటే నాన్న ఇంట్లో లేరనే భావనతో కన్నీళ్లు వచ్చేశాయి. అందుకే నేరుగా ఆయన సమాధి వద్దకు వెళ్లా. ఈ సారి ఆయనతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పూలతో నివాళులర్పించి.. కాసేపు అక్కడే కూర్చుండిపోయా. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయా. ఆయన గురించి మాట్లాడుతుంటే కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా. నేను టీమ్‌ఇండియాకు ఆడితే చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో జాతీయ జట్టు తరపున నేనాడాలని కల కన్నారు. అందుకోసం ఎంతో శ్రమించారు. కానీ ఆ స్వప్నం సాకారమవుతుంటే చూడలేకపోయారు. ఈ సిరీస్‌లో అనుక్షణం ఆయనే గుర్తుకొచ్చారు. ఆస్ట్రేలియాలో నేను తీసిన ప్రతి వికెట్‌ నాన్నకే అంకితం.
అమ్మ ఏమందంటే..: సెప్టెంబర్‌లో ఐపీఎల్‌-13 కోసం యూఏఈ వెళ్లిన నేను.. ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. సిరీస్‌ ఆరంభానికి ముందే నాన్న చనిపోయారని తెలిసింది. మానసికంగా కుంగిపోయా. పైగా అప్పుడు క్వారంటైన్‌లో ఒంటరిగా గడపాల్సి రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మకు ఫోన్‌ చేస్తే.. ''టెస్టుల్లో టీమ్‌ఇండియాకు నువ్వు ఆడాలనే మీ నాన్న కలను నిజం చేసిన తర్వాతే ఇక్కడికి రా'' అని చెప్పింది. సహచర ఆటగాళ్లు ఫోన్‌ సందేశాలతో స్థైర్యం నింపారు. కుటుంబం, స్నేహితులు, టీమ్‌ఇండియా ఆటగాళ్ల సహకారంతోనే ఇలాంటి ప్రదర్శన చేయగలిగా.

జాతి వివక్ష వ్యాఖ్యలతో..: ఆస్ట్రేలియా ప్రేక్షకులు నాపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం నన్ను మానసికంగా మరింత బలంగా మార్చింది. నా ప్రదర్శనపై ఆ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించకూడదని అనుకున్నా. ఆ సంఘటన గురించి కెప్టెన్‌కు చెప్పడం నా బాధ్యత. మేము కావాలంటే మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడి వెళ్లిపోవచ్చని అప్పుడు అంపైర్లు చెప్పారు. కానీ మేము ఆటకు గౌరవమిస్తామని, అలా మధ్యలో వెళ్లిపోమని మా నాయకుడు రహానె వాళ్లతో అన్నాడు. ఆ సంఘటన తర్వాత మరింత కసిగా బౌలింగ్‌ చేశా.
నాపై నమ్మకముంచారు: నా మూడో టెస్టులో (గబ్బా మ్యాచ్‌లో)నే బౌలింగ్‌ దళానికి నాయకుడిగా వ్యవహరించాల్సి రావడంతో ఒత్తిడికి లోనయ్యా. కానీ జట్టులోని ప్రతి ఒక్కరూ నాపై నమ్మకముంచారు. నాకు మద్దతిచ్చారు. ఆ సవాలును ఆస్వాదిస్తూ చివరి టెస్టులో మంచి ప్రదేశాల్లో బంతులేస్తూ వికెట్లు రాబట్టా. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు సాధిస్తానని అసలు ఊహించలేదు. ఆ ఇన్నింగ్స్‌లో లబుషేన్‌ వికెట్‌ నాకు బాగా సంతోషాన్నిచ్చింది. సిరీస్‌లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు (13) తీసిన బౌలర్‌గా నిలిచినందుకు ఎంతో సంతోషం కలిగింది.
వాళ్లను పోల్చలేం..: విరాట్‌ కోహ్లి గైర్హాజరీలో మూడు టెస్టుల్లోనూ జట్టును తాత్కాలిక కెప్టెన్‌ రహానె గొప్పగా నడిపించాడు. ఆటగాళ్లపై నమ్మకముంచి ముందుకు సాగాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు పరిమితమైన జట్టులో అతను తిరిగి స్ఫూర్తి నింపాడు. అయితే కోహ్లి, రహానేలను ఒకరితో ఒకరిని పోల్చి చూడలేం. నాయకులుగా ఇద్దరూ ఉత్తమ ప్రదర్శన చేశారు. విరాట్‌ భాయ్‌ నన్నెంతగానో నమ్మాడు. ఐపీఎల్‌లో అతని సారథ్యంలోని ఆర్సీబీకి ఆడినపుడు, జాతీయ జట్టు తరపున బరిలో దిగినప్పుడు నాపై విశ్వాసముంచాడు.

సిరాజ్‌ నేరుగా..

ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటిన భారత యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సొంతగడ్డ హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే నేరుగా తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించాడు. భావోద్వేగానికి గురైన అతను అక్కడే చాలాసేపు గడిపాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top