అమరావతి
పుర ఎన్నికలకు ముందస్తు భద్రతా చర్యలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాలుగా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో గొడవలు జరిగిన ప్రాంతాల్లో, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక వార్డులు, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి వార్డులోను పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నేర చరిత్ర, చెడు ప్రవర్తన కలిగిన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయాలని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం, నగదు, తాయిలాల ఆశ చూపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలి, బాపట్ల, స్పెషల్ బ్రాంచి డీఎస్పీలతో పాటు జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.