Wednesday, 25 Nov, 5.27 am ఈనాడు

మహబూబ్ నగర్
రాయితీ యూనిట్లు... ఉపాధికి మెట్లు

న్యూస్‌టుడే, పాలమూరు

అసలే పేద కుటుంబాలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు నోచుకోలేని పరిస్థితి. ఎక్కడ పనిచేసినా అరకొర వేతనంతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకొని పలువురు నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందుతున్నారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి, వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకొంటున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఉద్యోగం లేదని నిరుత్సాహానికి గురికాకుండా.. సమయం వృథా చేయకుండా.. పథకాలను వినియోగించుకొంటూ స్వయం ఉపాధితో ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని నిరూపిస్తున్నారు. రాయితీ యూనిట్ల ద్వారా ప్రస్తుతం ఉపాధి పొందుతున్న లబ్ధిదారులపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం.

జిల్లాలో 2014-15 ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎస్సీ నిరుద్యోగ యువతకు 210 వాహనాలను అందించారు. అందుకు రూ.10.02 కోట్లు వెచ్చించారు. అందులో రాయితీ కింద రూ.6.02 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా, బ్యాంకులు రూ.4 కోట్లు రుణం ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వాహనాల ద్వారా 210 మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారు.

వెంకటయ్య

నెలకు రూ.20 వేల ఆదాయం...: మహబూబ్‌నగర్‌ పుర విలీన గ్రామం ఎదిరకు చెందిన వెంకటయ్య ఇంటర్‌ వరకు చదివారు. 15 ఏళ్ల నుంచి డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక స్థోమతు లేకపోవడంతో ఇతరుల కారు నడిపేవారు. డ్రైవింగ్‌కు పోయిన రోజు రూ.300 వచ్చేవి. ప్రతిరోజు పని ఉండకపోవడంతో నెలకు కేవలం రూ.6వేలు సంపాదన ఉండేది. 2017లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణంలో కారును మంజూరు చేశారు. యూనిట్‌ విలువ రూ.8 లక్షలు కాగా.. రూ.4.80 లక్షలు రాయితీ పోగా.. బ్యాంకు నుంచి రూ.3.20 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. నెలకు రూ.7 వేలు కంతులు చెల్లిస్తూ.. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20 వేలు మిగులుతోందని వెంకటయ్య పేర్కొన్నారు. యాక్టింగ్‌ డ్రైవర్‌ నుంచి ఇప్పుడు సొంత కారు ఉండటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కామని, కరోనా సమయంలో కూడా కుటుంబం సాఫీగా సాగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేశవులు

ఆటో మంజూరు..: నవాబుపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన కేశవులు పదో తరగతి వరకు చదివారు. కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవర్‌గా మారారు. ఆటో యజమానికి ఈయనకు నెలకు రూ.4 వేలు వేతనం ఇచ్చేవారు. కుటుంబ అవసరాలకు సరిపోక ఇబ్బందులు పడేవారు. ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకోవడంతో 2016లో ఆటో కోసం రుణం మంజూరు అయింది. యూనిట్‌ ధర రూ.2 లక్షల్లో.. రాయితీ రూ.1.40 లక్షలు పోగా.. బ్యాంకు నుంచి రూ.60 వేలు రుణం తీసుకున్నారు. ఇప్పుడు నెలకు అన్ని ఖర్చులు పోను రూ.10 వేలకు పైగా సంపాదిస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకొంటూ.. చిట్టీలు కూడా కట్టుకుంటున్నానని, ఆర్థికంగా ఎదగడానికి ఆటో ఎంతో ఉపయోగపడుతోందని చెబుతున్నారు కేశవులు.

అంజి

సొంత ట్రాక్టర్‌ నడుపుకొంటూ..: మహబూబ్‌నగర్‌ పుర పరిధిలోని బోయపల్లికి చెందిన పత్తి అంజి ఐటీఐ వరకు చదివారు. తరవాత ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొనేవారు. 2018లో ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీ రుణం కింద ట్రాక్టర్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. రూ.8.40 లక్షల యూనిట్‌ మంజూరు అయింది. అందులో రూ.4.80 లక్షలు రాయితీ కాగా, బ్యాంకు నుంచి రూ.3.20 లక్షలు రుణం ఇచ్చారు. మరో రూ.40 వేలు చెల్లించి ట్రాక్టరు తీసుకొన్నారు. దానిద్వారా వస్తున్న ఆదాయంతో మరో పాత ట్రాక్టర్‌ కొనుగోలు చేశారు. వ్యవసాయ పనులు ఒప్పుకొంటూ వచ్చిన ఆదాయంతో రుణం కంతు నెలకు రూ.8 వేలు చెల్లిస్తున్నారు. రెండు ట్రాక్టర్లను వ్యవసాయ పనులకు వినియోగిస్తున్నట్లు అంజి తెలిపారు.

పాండు

కారు మంజూరుతో ఇబ్బందులు తీరాయి..: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సంజయ్‌నగర్‌కు చెందిన పాండు డిగ్రీ వరకు చదువుకొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పై చదువులకు వెళ్లలేకపోయారు. అయిదేళ్లు పలువురి దగ్గర డ్రైవర్‌గా పని చేశారు. ఓ ప్రధానోపాధ్యాయురాలి కారు డ్రైవర్‌గా మూడేళ్లు పని చేశారు. నెలకు రూ.7 వేలు మాత్రమే ఇచ్చేవారు. 2017లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ యూనిట్‌పై కారు మంజూరు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీరాయి. ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో నీటి పారుదలశాఖలో కారును అద్దెకు పెట్టి.. తనే డ్రైవర్‌గా ఉన్నారు. నెలకు రూ.33 వేల ఆదాయం వస్తోందని పాండు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను కుటుంబ పోషణ సాఫీగా నడుస్తోందని చెబుతున్నారు.

గౌతమ్‌

కుటుంబానికి కారే ఆధారం...: మహబూబ్‌నగర్‌లోని మేకలబండకు చెందిన గౌతమ్‌ ఇంటర్‌ వరకు చదివారు. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తూ నెలకు రూ.15 వేల వేతనం పొందేవారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రాయితీ రుణంపై కారు మంజూరు అయింది. ఇప్పుడు జియో కంపెనీకి కారును అద్దెకు నడుపుతున్నారు. నెలకు రూ.40 వేలు ఇస్తున్నారని, రుణం కంతు రూ.8 వేలు పోగా మిగిలిన డబ్బు కుటుంబానికి ఇస్తున్నానని పేర్కొంటున్నారు గౌతమ్‌. వారి కుటుంబానికి ప్రస్తుతం ఆ కారే ఆధారం. అక్క వివాహం అయిపోయిందని, అన్న, అమ్మ, నాన్న కలిసి ఉంటున్నామని, కుటుంబ పోషణకు ఇబ్బందులు తీరాయని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top