Sunday, 20 Sep, 10.45 pm ఈనాడు

తాజా వార్తలు
రహానేని తీసినట్లే డీకేను తీసేయొచ్చు: గావస్కర్‌

కోల్‌కతా సరిగా ఆడకపోతే మోర్గాన్‌కి పగ్గాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సీజన్‌లో కోల్‌కతా మొదట్లో సరిగా ఆడకపోతే ఆ జట్టు కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ను తొలగించి గతేడాది ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ అందించిన ఘనుడు ఇయాన్‌ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అందించే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన సన్నీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో షారుఖ్‌ జట్టు ఎంతో బలమైందని, దానికి మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడా జట్టులో మోర్గాన్‌, పాట్ కమిన్స్‌ చేరడంతో అది మరింత బలంగా మారిందని చెప్పాడు. మోర్గాన్‌తో మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ బలంగా మారిందని, అతడి అనుభవం ఆ జట్టుకు ఉపయోగకరమని సన్నీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

దినేశ్‌ కార్తిక్‌ కెప్టెన్సీలో ఈ సీజన్‌ ఆరంభంలో కోల్‌కతా సరిగా రాణించకపోతే తర్వాత అతడిని తొలగించి మోర్గాన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని, గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ అజింక్య రహానేను తీసేసి స్టీవ్‌స్మిత్‌కు జట్టు పగ్గాలు అందించిందని గుర్తుచేశాడు. మరోవైపు మోర్గాన్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉందని, జట్టును విజయపథంలో నడిపించే అనుభవం కూడా ఉందని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. ఇక ఆండ్రూ రసెల్‌ రూపంలో ఆ జట్టుకు అతిపెద్ద టీ20 ప్లేయర్‌ ఉన్నాడని చెప్పాడు. ఈసారి వేలంలో కోల్‌కతా అత్యధిక ధర వెచ్చించి మరీ పాట్‌ కమిన్స్‌ను తీసుకుందని, అయితే, ఇటీవల జరిగిన ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడు తేలిపోయాడని వివరించాడు. దీంతో కమిన్స్‌పై ఒత్తిడి నెలకొంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా, గంభీర్‌ తర్వాత 2018లో ఆ జట్టు పగ్గాలు అందుకున్న డీకే ఆ సీజన్‌లో ఫర్వాలేదనిపించాడు. అప్పుడు నాలుగో స్థానంలో నిలబెట్టాడు. కానీ, గతేడాది కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా తీసుకెళ్లకపోవడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో దినేశ్‌ కార్తిక్‌పై కాస్తంత ఒత్తిడి ఉంటుందనే విషయం తెలుస్తోంది. బుధవారం ముంబయితో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top