Monday, 14 Jun, 5.40 am ఈనాడు

విజయనగరం
రైతుల ఇక్కట్లు తీరినట్టేనా...?

● ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలు
● వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు యోచనలో ప్రభుత్వం


తెట్టంగిలోని రైతుభరోసా కేంద్రం

కలెక్టరేట్‌/ వ్యవసాయవిభాగం, న్యూస్‌టుడే: ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రాలకు స్వస్తి పలకాలని, రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే దీన్ని అమలు చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఏటా 1.21 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. ఒక్క సీజన్‌లోనే 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు సేకరిస్తున్నట్లు అంచనా. ఖరీఫ్‌ సీజన్‌లో 220 నుంచి 230 వరకు కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో రబీలో వరి సాగు తక్కువే. ఈసారి కేవలం 38 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అధికారులు నిర్ణయించారు. 40 కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేయాలని, పీఏసీఎస్‌, వెలుగు.. వంటి వాటి ద్వారా ఏర్పాటు చేస్తుంటారు. ఆయా కేంద్రాలకు సేకరణ నిమిత్తం క్వింటాకు రూ.31.25 పైసలు చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. ఇలా సంబంధిత కేంద్రాలకు ఏటా రూ.కోట్లలో కమీషన్‌ దక్కుతోంది. ఇక మీదట వీటిని రద్దు చేసి రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని సేకరించనున్నారు. ఆ కమీషన్‌ సైతం ఆర్‌బీకేలకే ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

పేరుకే కొనుగోలు కేంద్రాలు..: రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు కొన్నేళ్ల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఏటా వీటిని సీజన్‌లో ఏర్పాటు చేస్తున్నా.. వాటి ద్వారా రైతులకు ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటోంది. రైతులు నేరుగా దళారులు, మిల్లర్లనే ఆశ్రయించి పంట అందిస్తున్నారు. ఆ విధంగా క్వింటా దగ్గర రూ.400-రూ.500 వరకూ నష్టపోతున్నారు. రైతు దగ్గర నుంచి అలా సేకరించిన ధాన్యాన్ని దళారులు, కొంతమంది మిల్లర్లు కొనుగోలు కేంద్రాలకు తరలించి, మద్దతు ధరను స్వాహా చేస్తున్నారు. ఇందుకు కొనుగోలు కేంద్రాల సిబ్బందీ సహకారం అందిస్తున్నారు. జిల్లాలో 624 వరకు రైతుభరోసా కేంద్రాలున్నాయి. ఇకపై వీటి ద్వారా కొనుగోలు చేపడితే రైతుల ఇబ్బందులు చాలా వరకూ తొలగుతాయని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి గత సీజన్‌లోనే ధాన్యం కొనుగోలుకు, ఆర్‌బీకేలకు లింకు పెట్టారు. రైతులు ముందుగా ఆర్‌బీకేలకు వెళ్లి, ధాన్యం నమూనాల తేమశాతాన్ని పరీక్షించుకుని, అక్కడ చెప్పిన తేదీ ఆధారంగా టోకెను తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యం విక్రయించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల రైతులు చాలా శ్రమ పడేవారు. ఇప్పుడు ఆర్‌బీకేల్లోనే ధాన్యం కొంటే వారికి ఆ ఇక్కట్లు తీరినట్లే.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top