Saturday, 21 Sep, 1.45 pm ఈనాడు

తాజా వార్తలు
రోహిత్‌×కోహ్లీ: మళ్లీ నువ్వా నేనా!

బెంగళూరు: ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఉప సారథి రోహిత్‌ శర్మది ప్రత్యేక స్థానం. జట్టు గెలుపుకోసం వీరిద్దరూ వీరోచితంగా పోరాడతారు. ఇద్దరి బ్యాటింగ్‌ శైలి భిన్నమైనా ఒకే లక్ష్యంతో ముందుకుపోతారు. ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి పరుగులు సాధిస్తారు. భారత జట్టును విజయ పథంలో నడిపించే క్రమంలో వీరిద్దరూ అంతర్గతంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు.

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. మొహాలిలో వీర విహారం చేసిన అతడి మొత్తం స్కోరు 2,441. కేవలం 71 ఇన్నింగ్సుల్లోనే 50.85 సగటుతో సాధించాడు. మ్యాచ్‌ను గెలిపించేందుకు కడదాకా పోరాడేతత్వంతో పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే ఈ రికార్డును బద్దలు చేసేందుకు రోహిత్‌ శర్మ సిద్ధంగా ఉన్నాడు. 97 ఇన్నింగ్సుల్లో 32.45 సగటుతో అతడు 2,434 పరుగులు సాధించాడు. కోహ్లీని దాటేందుకు కేవలం 8 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో 12 పరుగులే చేసిన హిట్‌మ్యాన్‌ మూడో మ్యాచ్‌లో కసితో ఆడతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్‌ వచ్చి 8 పరుగులు చేసేస్తే విరాట్‌ స్కోరును దాటేస్తాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో టీమిండియా సారథి కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టేందుకూ అవకాశం లేకపోలేదు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top