Sunday, 15 Sep, 3.30 am ఈనాడు

మెదక్
సైకిల్‌ దొంగిలించాడని దాడి

అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: సైకిల్‌ దొంగిలించాడని స్థానికులు పట్టుకొని చేతులు కట్టేసి చితకబాదగా అస్వస్థతకు గురైన వ్యక్తి శనివారం ఉదయం మృతిచెందిన ఘటన మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కమలాకర్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన మహారాజుల నాగరాజు (35) భార్య అర్చనతో కలిసి మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌కు బతుకుదెరువు నిమిత్తం ఎనిమిదేళ్ల కిందట వచ్చారు. ఇద్దరు రోజువారీ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలోని గానుగు బస్తీ వైపు వెళ్లిన నాగరాజు ఓ ఇంటి వద్ద ఉన్న సైకిల్‌ను ఎత్తుకెళ్తుండగా.. గమనించిన శ్రీనివాస్‌, గానుగ మహేష్‌, యాదగిరి, జయమ్మలు కలిసి నాగరాజును పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచి మల్లేష్‌.. వీఆర్‌ఏ మధును విషయం తెలుసుకోమని పంపించారు. ఇంతలో దాడిచేసిన వారు నాగరాజును అతడి ఇంటి వద్ద వదిలి వెళ్లగా అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

కొట్టిన వారిపై ఫిర్యాదు చేయడానికి మిత్రుడితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలని చూడగా కొంతమంది వారించడంతో ఇంటికి తిరిగొచ్చి పడుకుని నిద్రలోనే మరణించాడు. అతని శరీరం, ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో భార్య అర్చన పోలీసులకు ఫిర్యాదు చేయగా తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌, సీఐ స్వామిగౌడ్‌, ఎస్‌ఐలు కమలాకర్‌, రమేష్‌ గ్రామానికి వెళ్లి ఘటనాస్థలంలో పరిశీలించారు. అతనిపై దాడి చేసిన శ్రీనివాస్‌, యాదగిరి, మహేష్‌, జయమ్మలను అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top